30, సెప్టెంబర్ 2014, మంగళవారం

విలువైన విద్య !


మైత్రేయ పురంలో గోపాలుడనే వాడు ఉండే వాడు.  వాడు ఏ పనీ చేయకుండా వ్యర్ధంగా కాలం గడిపే వాడు. తండ్రి సంపాదనతో ఇల్లు గడిచి పోతూ ఉండడంతో జులాయిగా తిరుగుతూ కాలక్షేపం చెయ్యడం అలవాటయింది. ఏదో పని చేసి ఎంతో కొంత తెమ్మని భార్య రోజూ పోరు పెడుతూ ఉండేది. వాడు వినిపించు కునే వాడు కాదు. చెప్పి చెప్పీ ఆమె విసిగి పోయింది.
      ఇలా ఉండగా జబ్బు చేసి, వాడి తండ్రి హఠాత్తుగా చని పోవడంతో ఇంటి బాధ్యత అంతా వాడి మీద పడింది. ఒక్క సారిగా వచ్చి మీద పడిన బాధ్యతలతో వాడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ! అప్పుడు కూడా ఏపనీ చేయడానికి ఇష్ట పడకుండా, తండ్రి సంపాదించిన దంతా ఖర్చు పెడుతూ కాలం గడిపే వాడు.
            కూర్చుని తింటే, కొండలయినా కరిగి పోతాయి కదా !
             తండ్రి సంపాదించినదంతా  ఖర్చయి పోవడంతో వాడికి మరింక రోజులు గడవడం కష్టమై పోయింది. ఏం చేయాలో తెలియక దిగులు పట్టుకుంది. ఇప్పటికయినా  ఏదో పని చేయమని భార్య అంటే ఆమెని కసురు కునే వాడు.
       ఇలా ఉండగా ఆ ఊరికి హిమాలయాల నుండి ఒక సాధువు వచ్చేడు. ఆ సాధువుకి రస వాద విద్య తెలుసుననీ, అతను ఇత్తడిని బంగారం చెయ్య గలడని ఎవరో గోపాలుడితో చెప్పారు.  గోపాలుడు సాధువు దగ్గరకి వెళ్ళాడు. ఆ సాధువుతో తన ఇంటి పరిస్థితి వివరించి చెప్పాడు. ఇంటి నుండి తెచ్చుకున్న ఒక చిన్న ఇత్తడి ముక్క నొక దానిని సాధువు చేతిలో పెట్టి, దానిని బంగారంగా చేయమని వేడు కున్నాడు.
   సాధువు కొద్ది క్షణాలు ఆలోచించి, గోపాలుడితో ఇలా అన్నాడు :  ‘‘నాయనా ! నువ్వు తెచ్చిన ఈ చిన్న ఇత్తడి ముక్కను బంగారంగా చేసి ఇవ్వడం నాకేం కష్టం కాదు ! నాకా విద్య తెలుసును ! కానయితే,  కక్కుర్తి సడ్డా, కడుపు నిండా లంటారు కదా ! అందు చేత నువ్వు వీలయినంత ఎక్కువ ఇత్తడిని సేకరించుకుని నా దగ్గరకి మళ్ళీ రా ! నేను హరి ద్వారం వెళ్ళి,  వారం రోజులలో మీ ఊరికి తిరిగి వస్తాను.  అప్పటికి నువ్వు ఎంత ఎక్కువ ఇత్తడి తెచ్చుకుంటే దానినంతా బంగారంగా చేసి నీకిస్తాను. నీ దరిద్రం తీరి పోతుంది ! ’’ అన్నాడు. సాధువు సాధువు మాటలకి చాలా సంతోషించి, లెక్క లేనంత ఇత్తడిని సంపాదించాలనుకుంటూ ఇంటికి చేరాడు గోపాలుడు.
        ఇక, ఆ రోజు నుండి గోపాలుడు ఇత్తడిని సమకూర్చు కునే పనిలో పడ్డాడు. ఊళ్ళోనే కాక, చుట్టు ప్రక్కల ఊళ్ళకు కూడా వెళ్ళి, ఎవరెవరి దగ్గర పాత ఇత్తడి సామాన్లు ఉన్నా, ఏవో మాటలు చెప్పి, వారు అడిగినంత ముట్ట చెప్పి , కొని ఇంటికి తెచ్చు కునే వాడు.ఇత్తడిని కొనడం కోసం డబ్బు కావాలి కనుక,  రాత్రీ పగలూ ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాడు. వాడికిప్పుడు క్షణం తీరిక ఉండడం లేదు. త్వరలోనే వాడి వ్యాపారాలు పుంజుకుని గొప్ప ధనవంతు డయ్యాడు. ఇత్తడికి గిరాకీ పెరగడంతో ఇత్తడి వ్యాపారం కూడా వాడికి బాగా కలసి వచ్చింది. ఇప్పుడు ఊర్లో ఉన్న వ్యాపారవేత్తలలో వాడికి చాలా పేరు వచ్చింది.
ఈ వ్యాపారాలలోనూ, సంపాదనలోనూ పడి,  గోపాలుడు సాధువు గురించి మరిచే పోయేడు !
    చాలా రోజుల తరువాత ఆ సాధువు ఆ  ఊరికి వచ్చి, స్వయంగా గోపాలుడి ఒంటికి అతిథిగా వచ్చేడు. గోపాలుడు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి, గోపాలుడితో ఇలా అన్నాడు : ‘‘నాయనా ! ఎంత ఇత్తడిని సంపాదించావో చెప్పు !
నేను రావడం కొంత ఆలస్యం అయింది. అయితే ఈ లోగా నువ్వు చాలా ఇత్తడిని పోగు చేసి ఉంటావు. దానినంతటినీ ఇలా తెచ్చివ్వు. బంగారంగా మార్చి
ఇస్తాను !’’ అన్నాడు.
   దానికి గోపాలుడు ‘‘ స్వామీ ఇత్తడిని పుత్తడిగా చేసే రసవాద విద్య మీకు తెలుసు. ఆ విద్యతో నేను ఎంత ఇత్తడి ఇచ్చినా బంగారంగా మార్చెయ్య గలరు. కానీ , నాకిప్పుడు అలా వచ్చే ధనంతో పని లేదు. శ్రమ చేసి సాందించు కునే గొప్ప విద్య నాకు ఇప్పుడు అలవడింది! నాకది చాలు ! ’’ అన్నాడు తృప్తిగా.
   ‘‘ నేను నీ నుండి కోరుకున్నదీ అదే నాయనా !’’  నవ్వుతూ అని సాధువు గోపాలుడిని దీవించి వెళ్ళి పోయేడు !

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

మెరిసే రంగు రాళ్ళు !


అనగా అనగా ఒక అడవిలో ఒక ఎలుగు బంటి ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ బయలు దేరింది. కొంత దూరం వెళ్ళాక, దానికొక పెద్ద పుట్ట కనిపించింది. పుట్ట తవ్వడం మొదలెట్టింది. అందులో దానికి మెరిసే రంగు రాళ్ళు లెక్క లేనన్ని కనిపించాయి. వాటిని చూసి, నిప్పు కణికె లేమో నని భయపడి దూరంగా పారి పోయింది. కాస్సేపటికి ధైర్యం కూడదీసుకుని దగ్గరగా వెళ్ళి వాటిని పరీక్షగా చూసింది. అవి మెరిసే రంగు రాళ్ళే తప్ప ,నిప్పు కణికెలు కావని  నిర్ధారణ కొచ్చింది. వాటన్నింటినీ ఒక ఆకు దొప్ప లోకి  ఏరి,  తనుండే గుహ దగ్గరకి వచ్చింది.  ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకో మని తన పిల్లలకి ఇచ్చింది. వాటితో  ఎలుగుబంటి పిల్లలు రోజూ సరదాగాఆడుకోసాగాయి.
      ఇలా ఉండగా, ఒక రోజు ఒక టక్కరి నక్క ఆ ఎలుగు బంటి పిల్లలు ఏవో మెరిసే రంగు రాళ్ళతో ఆడు కోవడం గమనించింది. ఎలాగయినా వాటిని తన స్వంతం చేసు కోవాలని దానికి దుర్బుద్ధి పుట్టింది. అది ఒక రోజు తల్లి ఎలుగుబంటి లేని సమయం చూసి ఆ పిల్లల దగ్గరకి వచ్చింది.  వచ్చి ఇలా అంది :  ‘‘మీకు తినడానికి నా దగ్గర చాలా రుచికరమైన ఆహారం ఉంది ! మీకు కావలసినంత ఇస్తాను. ఇంకా ఎంత కాలం ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకుంటారు ? విసుగు వెయ్యడం లేదూ ! వాటిని నాకిచ్చెయ్యండి ! ’’ అంది.
    ఎలుగు బంటి పిల్లలు కాస్సేపు ఆలోచించి, దానితో ఇలా అన్నాయి :
 ‘‘ నువ్వన్నది నిజమేలే ! వీటితో రోజూ మేము ఆడుకుంటూనే ఉన్నాం. మాకు మంచి రుచికరమైన తిండి తినాలని ఉంది ! అందు చేత ఈ ఒక్క రోజు మేము వీటితో ఆడుకుని, రేపు నీకు వీటిని ఇచ్చేస్తాం. రేపు ఇదే వేళకి ఇక్కడకి రా ! నువ్వు వచ్చేటప్పుడు మాకోసం రుచికరమైన ఆహారం తీసుకు రావడం మాత్రం మరచి పోవద్దు సుమా ! ’’ అన్నాయి.
     ఆ రాత్రి తల్లితో అవి ,నక్క  వచ్చి తమను మెరిసే రంగు రాళ్ళని తనకి ఇచ్చెయ్యమని అడిగినట్టుగా చెప్పాయి.  వాటికి బదులు తమకి  నక్క మంచి ఆహారం ఇస్తానన్నదని కూడా చెప్పాయి.
     తల్లి ఎలుగుబంటి అంతకు ముందే గజరాజు వలన ఆమెరిసే రంగు రాళ్ళు చాలా విలువైనవని తెలుసుకుంది. దానికి  నక్క దురాలోచన అర్ధమయింది. టక్కరి నక్కకి ఎలాగయినా తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. మర్నాడు నక్క వస్తే ఏం చెయ్యాలో వివరంగా పిల్లలకి చెప్పింది.
    మర్నాడు తల్లి ఎలుగు లేని సమయం చూసి  నక్క  ఎలుగు బంటి పిల్లల దగ్గరకి వచ్చింది. వాటితో ‘‘ పిల్లల్లారా ! మీరు నాకు ఆ మెరిసే రంగు రాళ్ళు ఇవ్వండి ...వాటిని తీసుకెళ్ళి నా ఇంటిలో దాచి, మీకు ఎంతో రుచికరమైన తిండి తెస్తాను ! ఇలా వెళ్ళి అలా క్షణంలో వచ్చెయ్యనూ ! ’’ అంది.
     ఎలుగు బంటి పిల్లలు తమకి ముందు రోజు తల్లి చెప్పినట్టగా  నక్కతో ఇలా అన్నాయి : ‘‘ సరేలే ! అదిగో ! ఆ చెట్టు తొర్రలో మా మెరిసే రంగురాళ్ళు ఉన్నాయి, వెళ్ళి తీసుకో ! కానీ మాకు మాత్రం వెంటనే మంచి రుచికరమైన తిండి తెచ్చి ఇవ్వాలి సుమా ! ’’ అని.
    అలాగే నంటూ  నక్క తన  ఉపాయం ఫలించినందుకు సంబర పడి పోతూ గబగబా చెట్టు తొర్ర దగ్గరకి వెళ్ళింది. ముందూ వెనుకా చూసు కోకుండా దానిలో సంతోషంగా చెయ్యి పెట్టింది.
   ఎలుగు బంటికి నిప్పు అంటే భయం కదా ! అంచేత, కోతి బావ సాయం తీసుకుని  అంతకు ముందే తల్లి ఎలుగు బంటి  అక్కడ రంగు రాళ్ళకి బదులు నిప్పు కణికెలు ఉంచింది !  ఆ విషయం తెలియక చెట్టు తొర్రలో చెయ్యి పెట్టింది నక్క.
 నిప్పు కణికెలను తాకడంతో దాని చేతులు కాలేయి ! చేతులే కాక మూతి కూడా కాలింది !
     దానితో ఆ టక్కరి నక్క అక్కడి నుండి లబోదిబోమని ఏడుస్తూ పారి పోయింది !
       మరెప్పుడూ అది ఎలుగు బంటిపిల్లల జోలికి, రానే లేదు !

22, సెప్టెంబర్ 2014, సోమవారం

పొగడ్త ఫలితం !


పూర్వం విక్రమ పురం అనే ఊళ్ళో గంగులు అనే గజ దొంగ ఒకడు ఉండే వాడు. వాడి చేతి లాఘవం అంతా యింతా కాదు ! బెంగా బెతుకూ లేదు. మంచీ చెడ్డా తెలియదు. ఎంతటి దొంగ తనమయినా అవలీలగా చేసే వాడు.చాలా బలవంతుడు. వాడి నోరు చెడ్డది. వాడంటే అందరికీ హడల్ ! గ్రామాధికారి ఒక సరి వాడిని పట్టించి కారాగారానికి పంపంచినా, వాడిలో మార్పు రాలేదు. మరింత పెట్రేగి పోయి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.
     ఇలా ఉండగా ఒక రోజు గంగులు తమ ఊరిలో ఉండే దేవాలయం నుండి దేవతా విగ్రహాలు దొంగిలించాడు. వాటిని ఊరి వెలుపల  ఒక పాడు పడిన నూతిలో దాచి పెట్టాడు.
   మర్నాడు గుడిలో విగ్రహాలు కనబడక భక్తులు గగ్గోలు పెట్టారు. అదిగంగులు పనే అని అందరికీ అర్ధ మయి పోయింది. కానీ వాడిని అడగడానికి ఎవరికీ ధైర్యం చాల లేదు. ఊరి వెలుపల బావిలో విగ్రహాలు గంగులు దాచేడని  వారికి ఆచూకీ తెలిసింది. కానీ గంగులు ఎప్పుడూ ఆ బావి దగ్గరే తచ్చాడుతూ ఉండడంతో వాటిని తెచ్చే సాహసం వాళ్ళు చేయ లేక పోయేరు. అలాగని విగ్రహాలు వాడి పరం చేసి ఉండడం కూడా వారికి కష్టంగానే ఉంది.
    చివరకి వర ప్రసాదం అనే ఒక యువకుడు ఒక ఉపాయం ఆలోచించేడు. దానిని ఊళ్ళో భక్తులందరికీ వివరించి ఏం చేయాలో చెప్పాడు.  అతని మాట ప్రకారం భక్తులు ఎప్పటి లాగే గుడికి వచ్చి, అక్కడ విగ్రహాలు లేక పోయినా, అవి లోగడ ఉండే ఖాళీ స్థలం లోనే పూజలు చేయడం మొదలు పెట్టారు !
   ఇదంతా గమనిస్తున్న గంగులికి మతి పోయింది ! విగ్రహాలు లేని గుడిలో భక్తులు ఎందుకు పూజలు చేస్తున్నారో తెలుసు కోవాలనుకున్నాడు. తనంటే అందరూ భయ పడతారు కనుక అలా ఎందుకు చేస్తున్నారో చెప్పమని వారిని నిలదీసాడు.
   అప్పుడు వరప్రసాదు వినయంగా చేతులు కట్టుకుని ఇలా చెప్పాడు :  ‘‘మన తాతల కాలం నాడు ఈ స్వామి, దేవేరులతో పాటు మన ఊరి వెలుపల బావిలో దొరికాడు. ఆ బావి శ్రీవారి పుట్టిల్లు అన్న మాట ! అయితే మనం బావి లోని విగ్రహాలను గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నాం.  స్వామికి ఒక సారి తన పుట్టిన చోటుకి వెళ్ళి రావాలని బుద్ధి పుట్టిందిట. ఒక మహా భక్తుని సాయంతో అక్కడికి వెళ్ళి కొద్ది రోజులలోనే గుడికి తిరిగి వస్తానని స్వామి పూజారి వారికి కలలోకనబడి చెప్పారుట.  ఆ మహా భక్తుడెవరో కానీ, అతడే స్వామిని తిరిగి ఇక్కడకి చేరుస్తాడు. అందుచేత, ఎప్పటికయినా ఆ మహా భక్తుడే విగ్రహాలను బావి నుండి ఇక్కడకి తెస్తాడని నమ్మకంతో ఉన్నాం. అంత వరకూ ఆటంకం లేకుండా స్వామికి ఈ ఖాళీ జాగాలోనే నిత్య పూజలు చేస్తున్నాం, ’’

   ఆ యువకుని మాటలు విన్నాక, గంగులికి నిజంగానే తానొక మహా భక్తుడిననే భావన కలిగింది. పులకించి పోయేడు. ఆ రాత్రి ఎవరూ చూడకుండా  దేవతా విగ్రహాలను భక్తితో బావి నుండి వెలికి తీసి,  తిరిగి గుడిలో పెట్టి వెళ్ళి పోయేడు !
   అప్పటి నుండి గుడిలో పూజాదికాలు యథావిధిగా జరుగుతున్నాయి !
   గంగులులో కూడా మంచి మార్పు వచ్చి, భక్తుడిగా మారేడు.
    ఊరంతా సంతోషించింది !!

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

అడవి చెట్లకి తప్పిన ముప్పు !



కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఓ రోజు అడివంతా మారు మ్రోగి పోయేట్టుగా ఏనుగు ఘీంకరించింది. అంటే, అడవి జంతువు లన్నీ వెంటనే సమావేశం కావాలని పిలుపు అన్నమాట!
      మరు క్షణంలోనే అడవి  లోని జంతువు లన్నీ బిలబిలా అక్కడికి చేరాయి. మృగరాజు సింహం, ఆ ప్రక్కనే పులి. దగ్గర లోనే ఎలుగు బంటి , ఏనుగు ఎనుము, జింక, కుందేలు, నక్క ... యిలా అన్నీ వచ్చి, తమకు తగిన చోటున నిలబడ్డాయి. పక్షులు చెట్ల మీద గుమి గూడితే, కోతులు  కొమ్మల మీద  వేలాడుతూ చేరాయి.
    అప్పుడు పులి ఇలా అంది : ‘‘సోదరులారా ! మనం  ఈ అడవిలో చాలా ళ్ళుగా ఉంటున్నాం. మన తాత తండ్రులు ఇక్కడే బతికేరు. ఈ అడవి పేరు సత్య వనం ! ఆ పేరు ఎందుకు వచ్చిదంటే, ఇక్కడ ఉండే చెట్లూ, చేమలూ, పక్షులూ, జంతువులూ అన్నీ ఏ నాడూ నీతి తప్ప లేదు.  అలాంటి మన సత్య వనానికి కొంత కాలం క్రిందట ఒక దొంగల గుంపు వచ్చింది.ఈ విషయం మీ అందరికీ తెలిసిందే !  వాళ్ళు ఒక పెట్టెను ఇక్కడే ఈ మామిడి చెట్టు మొదట్లో గొయ్యి తీసి దాచి ఉంచేరు. అలా చేసాక, దొంగల నాయకుడు గొంతెత్తి బిగ్గరగా ఇలా అన్నాడు : ‘‘ఓ అడవి జంతువు లారా ! చెట్టుల్లారా! పిట్టల్లారా ! ఇది మేం దొంగతనం చేసి తెచ్చిన పాపపు సొమ్ము. దీనిని ఇక్కడ దాస్తున్నాం.త్వరలోనే వచ్చి, తీసుకుని పోతాం. అంత వరకూ దీనిని మీరు కాపాడాలి. దీనిని ఎవరయినా తీసినా, లేదా తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నా, మా పాపంలో భాగం మీకూ వస్తుంది !
అందు వలన మేం వచ్చే వరకూ దీనిని భద్రంగా కాపాడండి ’’ అని చెప్పి, తన దొంగల గుంపుతో వెళ్ళి పోయేడు.
   దొంగల గుంపు వెళ్ళి పోయి చాలా ఏళ్ళవుతోంది. మరింక తిరిగి రాలేదు. వస్తారనే నమ్మకమూ లేదు. మన సత్య వనంలో ఈ పెట్టెను కాపాడ వలసిన బాధ్యత మన అందరి మీదా ఉంది. ప్రధానంగా ఆ బాధ్యతను మనం ఈ మామిడి చెట్టుకి అప్పగించాం. మీకు తెలుసు కదా ! ఇప్పుడు ఈ మామిడి చెట్టు మరింక ఎక్కువ కాలం ఈ పెట్టెను తాను కాపాడ లేనని చెబుతోంది. మనుషులు మనకి శత్రువులు. ఈ పెట్టెను ఉంచింది దొంగలు. అయితే నేం,  దీనినిక్కడ దాచి, ఆ బాధ్యత మనకి ఒప్పగించారు కనుక మనం ఇంత కాలం దీనిని కాపాడుతూ వచ్చేం. మన అడవికి సత్య వనం అనే పేరు నిలుపు కుంటూ వచ్చేం.ఆ పేరు పోగొట్టు కోవడం మంచిది కాదు. .అయితే,  ఇవాళ దూర ప్రాంతాలు చుట్టి వచ్చిన రామ చిలుక ఒక వార్తను మోసు కొచ్చింది. అదేమిటంటే, ఇక ఆ దొంగల గుంపు మరింక తిరిగి ఇక్కడకి వచ్చే అవకాశమే లేదు ! వాళ్ళంతా రాజభటుల చేతికి చిక్కి మరణ శిక్షకు గురయ్యారుట అని .
మరింక ఇప్పుడేం చేయాలనే ఆలోచన అడవి జంతువులకి వచ్చింది.అందుకే మళ్ళీ సమావేశ మయ్యాయి. ముందు ఆ పెట్టెను భూమి లోనుండి వెలికి తీయాలనుకున్నాయి. ఎలుగుబంటికి ఆ పని అప్ప చెప్పాయి. ఎలుగు గొయ్యి తవ్వింది. చిత్రంగా ఆ గొయ్యిలో దొంగలు దాచిన పెట్టె లేదు !
    దొంగలంతా రాజ భటుల చేతికి చిక్కి నప్పుడు తప్పించు కొన్న ఒక దొంగ తన వాళ్ళందరూ ఉరిశిక్ష పడి మరణించాక, తాను ఒక్కడూ ఒక రాత్రి వేళ వచ్చి, దానిని త్రవ్వి తీసుకు పోయాడు ! ఈ విషయం ఎవరికీ తెలియదు.
అడవి జంతువు లన్నింటికీ మామిడి చెట్టు మీద చెప్ప లేనంత కోపం వచ్చింది. ఈ చెట్టే దానిని కాజేసింది . మన సత్య వనానికి ఎన్నడూ రానంత చెడ్డ పేరు వచ్చింది. దీనికి శిక్ష పడాలి. దీనితో పాటు అడవిలో ఉన్న చెట్లన్నింటినీ కూల్చి పారెయ్యాలి ! అలా చేస్తే కానీ ఈ వృక్ష జాతికి బుద్ధి రాదు ! అనుకున్నాయి ఆగ్రహంగా.  అందుకు సిద్ధపడ్డాయి. వాటి నిర్ణయంతో అడవిలోని చెట్లూ, పొదలూ, లతలూ వజవజలాడి పోయేయి. వాటి మీద కాపురాలుండే పక్షులు లబోదిబోమన్నాయి.కొమ్మలూ, రెమ్మలూ, ఆకులూ, పూల రెక్కలూ ఊపుతూ చెట్లు కన్నీరు కార్చాయి.
    ఒక ముసలి కోతికి మాత్రం అడవి జంతువుల తొందరపాటు నచ్చ లేదు. అది ఉపాయంగా వాటితో ఇలా అంది : ‘‘తొందరపాటు వద్దు. మన సత్య వనంలో ఎప్పుడూ ఎలాంటి అక్రమమూ జరుగదు. నగల పెట్టె కర్రది కనుక చాలా కాలం భూమిలో ఉండి పోవడం చేత శిధిల మైపోయి భూమిలోకలిసిపోయి ఉంటుంది. వానలకీ వరదలకీ అందులోని నగలన్నీ ఎక్కడికో కొట్టుకుని పోయి ఉంటాయి. అంతే తప్ప ఈ మామిడి చెట్టు దానిని కాజేసి ఉండదు. తాతల కాలం నుడీ ఈ మామిడి చెట్టు ఎంత మంచిదో మన అందరికీ తెలుసు. నిష్కారణంగా ఇప్పుడు దీని మీద నిందారోపణ చేసి, దీనితో పాటు మొత్తం అడవి లోని చెట్ల నన్నింటినీ నాశనం చెయ్యాలను కోడం తగదు. మనం తెలివి తక్కువగా ప్రవర్తిస్తే, మన పచ్చని అడివంతా ధ్వంసమై పోతుంది. అది ఎవరికీ మంచిది కాదు !
విలువైన నగల పెట్టె  ఇక్కడే మట్టిలో కలసి పోవడం చేత దీని భూసారం మరింత ఎక్కువయింది. అందుకే ఈ చెట్టు మునుపటి కన్నా ఎంతో రుచికరమయిన పళ్ళను ఇస్తోంది. గమనించ లేదూ !’’    దాని మాటలో అడవి జంతువు లన్నీ పునరాలోచనలో పడి, తమ నిర్ణయాన్ని మార్చు కున్నాయి.
   అడవిలో వృక్ష జాతి హమ్మయ్య ! అని ఊపిరి  అని  ఊపిరి  పీల్చుకుంది !

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దుర్బుద్ధి


ఒక అడవిలో జంబుమాలి అని ఒక నక్క ఉండేది.అది చాలా జిత్తులమారి నక్క! అంతే కాదు, గొప్ప స్వార్ధపరురాలు కూడా. రోజూ ఉదయాన్నే లేచి, దేవుడిని ఇలా వేడుకునేది :  ‘‘ దేవా ! ఈ అడవిలో అంతా నన్ను నీచంగా చూస్తూ ఉంటారు. నేను టక్కరి దానినట. జిత్తులమారినట.. అందు చేత ఇవాళ ఈ అడవి జంతులు వేటికీ తిండి దొరక కుండా చెయ్యి. అంతే కాదు, నాకు మాత్రం కడుపు నిండి పోయేటంత  మంచి తిండి దొరికేలా చూడు ! అలా చెయ్యి తండ్రీ ! ఈ అడవిలో నేను తప్ప మిగతావి ఏవీ సుఖంగా ఉండ కూడదు ! వాటి పొగరు అణిగి
 పోవాలి ! ’’ అని వేడుకునేది.
     ఒక రోజు నిద్ర లేస్తూనే ఎప్పటిలాగే దేవుడిని వేడుకుని, తిండి కోసం బయలు దేరింది జంబుమాలి. అలా వెళ్ళగా వెళ్ళగా దానికి ఒక చోట అప్పుడే చచ్చి పడున్న ఒక పెద్ద ఏనుగు కళేబరం కనబడింది. నక్క ఆనందానికి అంతూ పొంతూ లేకుండా పోయింది. చుట్టూ చూసింది. ఇంకా ఎవరూ ఆ ఆహారాన్ని చూసినట్టుగా లేదు. ఏమి నా అదృష్టం ! ’  సంతోషంగా  అనుకుంది నక్క. ‘‘ దేవుడా ! ఈ రోజు నాకు కడుపు నిండా తిండి దొరికేలా చేసావు. నీకు నిజమైన నీ భక్తు లెవరో ఇప్పటికి తెలిసింది కదా ! ’’  అని దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకుంది.
       ‘‘ ఇన్నాళ్ళకు దేవుడు నా మొర ఆలకించాడు. నాకు పుష్కలంగాతిండి దొరికేలా చేసాడు. అలాగే, నేను కోరినట్టుగా  తక్కిన అడవి జంతువులు వేటికీ ఇవాళ తిండి దొరక్కుండా చేసాడో , లేదో , చూడాలి. అడివంతా తిరిగి ముందు
ఆ విషయం తెలుసుకుంటాను. తిండి దేముంది! ఇలా వెళ్ళిఅలా వచ్చెయ్యనూ! వచ్చేక, కడుపు పగిలేలా  తినొచ్చు ! ’’  అనుకుంటూ తనకు దొరికిన ఆ ఏనుగు కళేబరాన్ని ఎవరి కంటా పడకుండా ఉండేలా ఒక చోట దాచి, ఆకులూ అలమలూ కప్పి జాగ్రత్త చేసింది.
   తర్వాత అక్కడ నుండి బయలు దేరి, కనబడిన ప్రతి జంతువునూ ‘‘ నీకివాళ తిండి దొరికిందా ? ’’ అని అడగడం మొదలు పెట్టింది.  ముందుగా పులి కనబడితే ‘‘ పులి రాజా ! భోజన మయిందా ? ’’ అనడిగింది. దానికి పులి ఉసూరుమంటూ ‘‘నేను ముసిలిదానినైపోయాను. మునుపటిలా వేటాడే ఓపిక ఉండడం లేదు. వాళ తినడానికి ఏమీ దొరక లేదు. ఆకలితో నా కడుపు కాలి పోతోంది ’’ అంది దీనంగా.
నక్క పైకి ‘‘ అయ్యో, పాపం ! ’’ అంటూ జాలి నటించింది.  లోలోపల సంతోషపడుతూ అక్కడి నుండి బయలు దేరింది. తర్వాత అడివంతా చాలా దూరం చక్కబెట్టింది. ఏ జంతువుని అడిగినా తిండి దొక లేదనే చెప్పడంతో నక్క ఆనందం అంతా యింతా కాదు !  మంచి శాస్తి జరిగింది ! అని  సంబర పడి పోయింది. పైకి మాత్రం వాటి పట్ల సానుభూతి చూపిస్తూ మాటలాడేది.
    ఆ రోజు నక్కకి అడివంతా ఎంత తిరిగినా  తృప్తి కలగడం లేదు. ఒళ్ళూ మీదా తెలియడం లేదు. ఇదిగో , అదిగో మరో దాన్ని అడిగి చూదాం ! అనుకుంటూనే అడివంతా  తిరుగుతూనే ఉంది. ఏ జంతువూ తనకు తిండి దొరికిందని చెప్పక పోవడంతో దాని ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
     అలా తిరుగుతూ ఉండగానే చీకటి పడి పోయింది. కుండ పోతగా వర్షం మొదలయింది. పిడుగులూ, టఉరుములతో నానా బీభత్సంగా తయారయింది. చుట్టూ చీకటి కమ్ము కోవడంతో నక్క ఒక్క అడుగు తీసి ముందుకు వెళ్ళ లేక పోయింది. ఆ జడి వానకి అడవిలో  చెట్లన్నీ విరిగిపడి ,దారీ తెన్నూ కనిపించేలా లేదు.  భయంతో ఒక చెట్టు తొర్రలోకి దూరి, చలికి వణికి పోతూ బిక్కు బిక్కుమంటూ గడిపింది. వాన ఎంతకీ తగ్గ లేదు.
   అప్పుడు దానికి తన ఆకలి గుర్తుకొచ్చింది. ఆకలితో కడుపు దహించుకు పోసాగింది. దానికి తోడు, అడవి జంతవులు తిండి దొరక లేదని తనతో అబద్ధం కానీ చెప్ప లేదు కదా ! అనే అనుమానం దానికి అప్పుడు  కలిగింది. ఉదయం నుండీ తిండి మాట ఎత్తకుండా తిరిగి తిరిగి అలిసి పోయాను ! చలికి వణికి పోతున్నాను. తిండి లేక నీరసంతో అడుగు కదప లేక పోతున్నాను. ఆకలి మండి పోతోంది. అడవి జంతువలన్నీ ఈ సరికి దొరికిందేదో తిని వెచ్చగా పడుకున్నాయి కాబోలు ! అనుకుంది.
     ఈ ఆలోచన దానిని ఆకలి బాధ కంటె ఎక్కువగా బాధించింది.
      ఆకలి బాధతో ఏడుస్తూ అది సొమ్మసిల్లి పడి పోయింది.
      దుర్బుద్ధికి ఫలితం ఇలాగే ఉంటుంది కదా !!


17, సెప్టెంబర్ 2014, బుధవారం

నోటికి తాళం !


అనగా అనగా ఒక ఊళ్ళో సోమయ్య అనే ఒక ఆకతాయి ఉండే వాడు. పెద్దంతరం,చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వారిని ఎంత మాట తోస్తే అంత మాట అనెయ్యడం వాడికి అలవాటు ! ఎవరెంత నచ్చ చెప్పినా వినిపించు కునే వాడు కాదు. వాడి  నోటికి జడిసి ఊళ్ళో అంతా వాడికి దూరంగా మెలగ సాగేరు.
    ఇలా ఉండగా ఒక నాడు ఆ ఊరికి గొప్ప యతీంద్రుల వారు ఒకరువచ్చేరు. అతనికి గొప్ప మహిమలు ఉన్నాయని అందరూ పొగుడుతూ ఉండే వారు. ఆ సంగతి సోమయ్య చెవిని కూడా పడింది. సోమయ్య  ఆ యతీంద్రుని గురించి చాలా విన్నాడు.  జరిగిందీ, జరుగ బోయేదీ కూడా  ఒక్క పిసరు పొల్లు పోకుండా చెప్ప గలరని విన్నాడు. అంతే కాకుండా వారిని దర్శించు కుంటే  గొప్ప మేలు జరుగుతుందని కూడా విన్నాడు.  సోమయ్యకి కూడా  ఆ యతీంద్రుల వారిని దర్శించు కోవాలని బుద్ధి పుట్టింది.  అలా అనుకుంటూనే  ఏ రోజుకారోజు బద్ధకించి, రోజులు గడిపేసాడు. వాడికి బుద్ధి పుట్టి,  ఓ రోజు సాయంత్రం వెళ్ళే సరికి
 ఆ యతీంద్రుల వారు  ఆ ఉదయమే ఊరు విడిచి  వెళ్ళి పోయేరు !
    సోమయ్యకి చెప్ప లేనంత నిరాశ కలిగింది. ఉక్రోశం వచ్చింది. ఊరిలో దాదాపు అందరూ వారిని అప్పటికే దర్శించుకో గలిగారు. తన కొక్కడికే అతని దర్శన భాగ్యం దొరక లేదు.  దానితో వాడి కడుపు రగిలిపోయింది. తన కోపాన్ని యతీంద్రుల వారి మీదకే నెట్టి, నానా కారుకూతలూ మొదలు పెట్టాడు. ఒక వితండ వాదాన్ని ప్రారంభించాడు. ఊర్లో అందరితో వాదనకి దిగి, నోటికొచ్చి నట్టు వాగడం మొదలు పెట్టాడు.  ‘‘ నాలాంటి మహా భక్తుడు తనని చూడడానికి  వస్తున్నాడని కూడా తెలుసుకో లేక ఊరొదిలి వెళ్ళి పోయేడు !  అతనేం యతి ! అతనిదేం
మహిమ !  వట్టి దొంగ సన్యాసి ! మీరంతా అతడిని నమ్మి మోస పోయారు ..’’ అంటూ తెగ వాగడం మొదలు పెట్టాడు. తాము నమ్మిన మతీంద్రులను వాడు అలా దుర్భాషలు ఆడడం ఎవరికీ నచ్చ లేదు. కాదంటే తమనీ నోటికి వచ్చి నట్టు తివడతాడని అంతా నోరు మెదపకుండా ఉండి పోయేరు. వాడి నోటికి తాళం వేయడం లాగో ఎవరికీ తెలిసింది కాదు !
    చివరకి,  రామయ్య అనే ఒక తెలివైన కుర్రాడు ఒక రోజు  సోమయ్యతో ఇలా అన్నాడు :  ‘‘ ఊర్లో వృద్ధులూ, వికలాంగులూ, రోగ గ్రస్థులూ, ఇంకా నీ లాంటి మహా భక్తులూ మాత్రమే యతీంద్రుల వారిని దర్శించుకో లేక పోయేరు. అలాంటి వారందరికీ వారు ప్రత్యేకంగా వారి కలల లోకి వచ్చి , దర్శన మిస్తున్నారు !నేడో, రేపో మహా భక్తుడవైన నీకల లోకి కూడా వచ్చి కనబడతారు కాబోలు, అదీ,నీభక్తి నిజమైన దయితేను మాత్రమే సుమా ! నీది నిజమైన భక్తి అని ఊర్లో అందరికీ తెలుసు. నీ అంత గొప్ప భక్తుడు ఊళ్ళో మరొకడు లేడు ! అంచేత వారు తప్పకుండా నీ కలలోకి వచ్చి కనపబడతారు ... అసలు ఈ సరికే వారి దర్శనం నీకు కలలో జరిగే ఉంటుంది .. అవునా !  ఏమయినా, నీ అంత అదృష్ట వంతుడు
మన ఊళ్ళోనే కాదు, చుట్టు ప్రక్కల గ్రామాలలో కూడా ఎక్కడా లేడయ్యా ! భాగ్యశాలివి ! మాకా అదృష్టం లేదు ! ’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు !
    సోమయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. కలలో యతీంద్రులు కనబడ లేదంటే , ఊరి వాళ్ళ ముందు తను మహా భక్తుడు కాకుండా పోతాడు !
     అంచేత,  ‘‘ అవునవును యతీంద్రుల వారు నాకు నిన్న రాత్రే కలలో కనిపించారు. చాలా సేపు మాట్లాడు కున్నాం కూడానూ ! ’’ అని బొంకాడు.
      ఆ తర్వాత వాడు మరింక యతీంద్రుల వారి గురించి అవాకులూ చెవాకులూ పలకడం మానీసేడు !
       వాడి నోటికి తాళం పడింది !!

15, సెప్టెంబర్ 2014, సోమవారం

భలే తీర్పు !


అనగా అనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండే వాడు. అతని పేరు కృష్ణయ్య. ఊర్లో ఎవరికి ఏ తగవు వచ్చినా, రెండు పక్షాల వారి వాదనలనూ విని,  చక్కగా తీర్పు చెప్పే వాడు.  అతని తీర్పనకు ఎదురు ఉండేది కాదు ! కృష్ణయ్య చెప్పే తీర్పులు వినడానికి  గ్రామం లోని వారే కాకుండా, చుట్టు ప్రక్కల ఊర్లనుండీ జనం విరగబడి వచ్చే వారు ! అతను చెప్పిన తీర్పుల లోని సబవు గురించి రోజుల తరబడి మెచ్చుకుంటూ  మాట్లాడుకునే వారు.
    ఒక రోజు కృష్ణయ్య దగ్గరకు ఊర్లో ఉండే ఇద్దరు వ్యక్తులు వచ్చేరు.  వారిలో ఒకడి  పేరు రామయ్య. రెండో వాడు సోమయ్య.
    మందుగా రామయ్య తన గోడు ఇలా చెప్పు కున్నాడు : ‘‘అయ్యా ! నా పేరు రామయ్య. పెద్ద వీధిలో ఉంటాను. ఇతడు నా దగ్గర పని వాడు. పేరు సోమయ్య. ఇతనికి జీతం బాగానే ముట్ట చెబుతున్నాను. తిండీ బట్టా ఇస్తున్నాను. చక్కగా చూసు కుంటున్నాను.కానీ, ఇతడి బుద్ధి మంచిది కాదు. మొదట్టో బాగానే ఉండే వాడు కానీ, ఇటీవలే మారి పోయాడు. నాకు అనుమానం కలిగి, ఇతని బుద్ధి తెలుసు కోవాలను కున్నాను.
   నిన్న ఉదయం మా ఇంటి గదిలో అందరికీ కనబడే లాగున ఓ వెండి భరిణె ఉంచాను. తలుపు చాటు నుండి చూస్తున్నాను.వీడు అటూ, యిటూ దొంగ చూపులు చూస్తూ ఉండడం గమనించాను. వీడు ఆ వెండి భరిణెని తటాలున తీసి పంచె చాటున దాచేసుకుని ఏమీ ఎరగనట్టు వీధి లోకి వెళ్ళి పోబోతూ ఉంటే పట్టు కున్నాను. వీడు బిగ్గరగా ఏడుస్తూ తన తప్పు ఒప్పు కున్నాడు. వెంటనే పని లోనుండి తీసి వేసాను. వీడు మాత్రం తన తప్పును అంగీకరిస్తూనే, తనని పని లోనుండి మాత్రం తీసెయ్య వద్దని జలగ లాగా పట్టు కుని వదలడం లేదు !
వీడి బుద్ధి బయట పడ్డాక కూడా వీడిని పనిలో ఎలా పెట్టు కోగలను తమరే తీర్పు చెప్పండి ! ’’ అన్నాడు.
    సోమయ్య తను వెండి భరిణె దొంగతనం చేసి నటట్టుగా అంగీకరించేడు.  లోగడ ఎప్పుడూ అలాంటి దొంగ పనులు చేయ లేదని ఏడుస్తూ చెపాడు. అదే మొదటి సారి అనీ, తన సంపాదన చాలక పోవడంతో  ఇంటి దగ్గర పరిస్థితులు చాలా  దారుణంగా ఉన్నాయని ఏడుస్తూ  ఇలా చెప్పాడు.. ‘‘ఆ సమయంలో  నా బాధలన్నీ గుర్తుకు వచ్చి. అనుకోకుండా  వెండి భరిణె కనబడడంతో మనసు కట్టుకో లేక దానిని దొంగిలించాను. తప్పయింది. కనికరించండి.. ఇప్పుడు రామయ్య గారు నన్ను పని లోనుండి తీసేస్తే మా కుటుంబానికి ఆత్మ హత్యలు చేసు కోవడం తప్ప మరో దారి లేదు !’’ అంటూ లబో దిబో మన్నాడు.
    కృష్ణయ్య కాస్సేపు ఆలోచించి ఇలా తీర్పు చెప్పాడు :  ‘‘ఎలా చేసినా, ఎందుకు చేసినా, సోమయ్య దొంగ తనం చేసాడు కనుక అతనికి వంద కొరడా దెబ్బలు శిక్ష వేస్తున్నాను. ఇక,  సోమయ్య లేమి తనం తెలిసి కూడా అతని బలహీనతనకి పరీక్ష పెట్టినందుకు రామయ్యని కూడా శిక్షించక తప్పదు !నేరం చేయడం ఎంత తప్పో, నేరానికి ఏదో విధంగా ప్రేరే పించడమూ అంతే నేరం.
   అందు చేత, రామయ్యకి శిక్ష. అదేమిటంటే, అతడు సోమయ్యని తిరిగి పనిలో పెట్టు కోవాలి.అంతే కాదు , ఇక నుండీ అతనికి ఇచ్చే జీతాన్ని, కూడూ గుడ్డలను కూడా  రెట్టింపు చేయాలి.  ఇదే అతనికి సరైన శిక్ష ! ’’ అని తీర్పు చెప్పాడు.
  చుట్టూ ఉన్న జనం ఆ తీర్పు విని ‘‘ భలే ! చాలా బాగుంది ! ’’ అని
మెచ్చు కున్నారు !

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

ప్రాణ భయం ... వింత జంతువు


అనగా అనగా ఒక అడవిలో చాలా రకాలయిన జంతువులూ,పక్షులూ హాయిగా నివశిస్తూ ఉండేవి. ఇలా ఉండగా ఒక రోజు ఎక్కడి నుండో ఒక వింత జంతువు ఆ అడవిలోకి ప్రవేశించింది.అలాంటి వింత జంతువును ఆఅడవిలో జంతువులు కానీ, పక్షులు కానీ మునుపెన్నడూ చూసి ఉండ లేదు ! ఆ వింత జంతువు కూడా అంతకు ముందు ఏనుగు వంటి భారీ శరీరం గల జంతువును కానీ, సింహం వంటి భీకర మయిన ఆరాన్ని కానీ, పులి లాగ వేగంగా పరిగెత్త గల జంతువుని కానీ, చూసి ఉండ లేదు.అలాగే కోకిల వలె కమ్మ నయిన కంఠం ఉన్న పక్షిని కానీ, చిలుక లాంటి అందమయిన రూపం గల దాన్ని కానీ, నెమలి లాగ వయ్యారాలు పోతూ నాట్యం చేసే దానిని కానీ అంతకు  ముందెప్పుడూ చూడ లేదు !ఎక్కడో ఎడారి ప్రాంతం నుండి వచ్చిన ఆ వింత జంతువుకి  ఈ మైదానం ప్రాంతం లోని జంతువులూ, పక్షులూ ఇలా హాయిగా జీవిస్తూ ఉండడం చూసి అసూయ కలిగింది. దాని కడుపు  రగిలి పోయింది. అడవిలో ప్రతి జంతువుకీ ఏవో కొన్ని చక్కని ప్రత్యేకతలు ఉండడం గమనించింది. ఏ ప్రత్యేకతలూ లేకుండా తన ఆకారం వెగటు పుట్టేలా ఉండడం తలచుకుని అది అసూయతో  కుంగి పోయింది.  ఎలాగయినా అడవికి తానే రాజయి, వాటి మీద పెత్తనం  చెలాయించాలనుకుంది.
    వెంటనే అడవి జంతువులనీ, పక్షులనీ సమావేశ పరచి ,వాటితో ఇలా అంది :  ‘‘నేను చాలా దూర ప్రాంతాల నుండి వచ్చాను.  దాదాపు దేవ లోకానికి దగ్గర నుండి అన్న మాట ! అక్కడ మంచు కొండల్లో మహా ఋషులు తపస్సులు చేసు కుంటూ ఉంటారు. నేను చిర కాలం వారికి సేవలు చేసుకుని, వారి నుండి కొన్ని గొప్ప  శక్తులు పొందాను.మీ అడవి జంతువుల లోనూ , పక్షుల లోనూ లేని  ఒక ప్రత్యేకత నాలో ఉంది ! నేను భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఇట్టే చెప్ప గలను ! కొద్ది రోజులలో  ఒక మహా ప్రళయం ముంచుకు రాబోతోంది. అది ఈ అడవిని మొత్తం నాశనం చేయబోతోంది.  ఆప్రళయం నుండి అందరినీ కాపాడే శక్తి నాకు ఒక్క దానికే ఉంది ! అదీ కాక, ఆ మహా ప్రళయం వచ్చి, ముందుగా ఈ అడవికి రాజునీ, తర్వాత తక్కిన వారినీ కబళించి వేస్తుంది. ఈ అడవికి రాజు  దుర్బుడైతే మొత్తం అందరికీ ప్రమాదమే. మీ రాజుకి ఆ మహా ప్రళయాన్ని ఎదుర్కొనే శక్తి లేనట్టు అనిపిస్తోంది. ఉంటే సంతోషమే. మీ మంచి కోరి చెబు తున్నాను.  మీరే ఆలోచించి ఏ విషయమూ తేల్చు కోండి. నేనయితే మాత్రం మిమ్మల్ని ఆ మహా ప్రళయం నుండి కాపాడ గలను ! నన్ను కూడా నేను కాపాడు కోగలను !
మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు ముచ్చట వేస్తోంది. అన్యాయంగా బలై పోకూడదని ఇంతగా చెబుతున్నాను. ఆలోచించండి. కాదూ కూడదూ అంటే నేను తిరిగి మా  రా.జ్యానికి చక్కా పోతాను !’’ అంది.
     దాని మాటలు విని అడవికి రాజయిన సింహంతో పాటు తక్కిన జంతువులూ, పక్షులూ వజవజ వణికి పోయాయి. మరో దారి లేక ,అవన్నీ ఒక నిర్ణయానికొచ్చి, ఆ వింత జంతువుని ఇక నుండీ తమ అడవికి రాజుగా ఉండి, తమని ఎలాగయినా కాపాడ మని వేడుకున్నాయి.
   వింత జంతువు తన పాచిక పారి నందుకు సంతోషించి, అందుకు అంగీకరించింది.
ఆనాటి నుండీ అడవిలో జంతువు లన్నీ తమ రాజయిన ఆ వింత జంతువుకి రోజూ మూడు పూటలా కావలసినత ఆహారం, నీరు సమకూర్చి పెట్టసాగేయి. దానిని భయ భక్తులతో సేవించడం మొదలు పెట్టాయి. రాజు కనున, దాని అందాన్నీ, సుగుణాలనూ తెగ పొగడడం ప్రారంభించేయి ! వింత జంతువు అడవిలో రాజ భోగాలు అనుభవించ సాగింది ! దానితో దానికి గర్వం ఎక్కువయింది ! అడవి జంతువులని నానా రకాలుగా పీడించడం మొదలు పెట్టింది.  తనకి నచ్చిన జంతువుని  రోజు కొకటి చొప్పున చంపి తినేది.
      కొద్ది కాలం లోనే అడవి జంతువు లన్నీ, అది తమని మోసం చేసిందని గ్రహించాయి.  ఎలాగయినా, అడవి నుండి ఆ వింత జంతువుని  తరిమేయాలని రహస్యంగా సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఒక  వృద్ధ జంబుకం
( ముసలి నక్క ) ఆ బాధ్యత తీసుకుంది !
    అది ఒక రోజు ఆ వింత జంతువు దగ్గరకి వచ్చి, వినయంగా చేతులు కట్టుకుని ఇలా అంది :  ‘‘రాజా ! మీరు మహా ఙ్ఞానులు ! మీరు చెప్పిన భవిష్య వాక్కు ఫలించ బోతోంది! తీతువు దూర ప్రాంతాలకి ఎగిరి వచ్చి ఇప్పుడే ఆ సంగతి చెప్పింది. మీరన్నట్టుగా ఆ మహా ప్రళయం వచ్చేస్తోంది ! ఎంతో దూరంలో లేదుట ! మీరన్నట్టే, అది, ముందుగా ఈ అడవికి రాజునీ, తర్వాత మిగతా జంతువులనీ చంపి తినేస్తానని దిక్కులు పగేలా అరుస్తూ వస్తోందిట ! మరిప్పుడు తమరు  దానిని ఎదర్కొనే సమయం వచ్చింది ! ఎలాగయినా దానిని చంపి, మమ్మల్ని కాపాడండి ’’ అంది దీనంగా ముఖం పెట్టి.
   దాని మాటలు వింటూనే వింత జంతువు ముఖంలో రంగులు మారి పోయేయి ! భయంతో దానికి ముచ్చెమటలు పట్టాయి. అడవి జంతువులని వంచంచడానికి తాను చేసిన కల్పనే ఇప్పుడు నిజం కాబోతోంది కాబోలు అని అది నమ్మింది.
   ఫ్రాణ భయంతో ముందూ వెనుకా చూడ కుండా అడవి వదిలి పారి పోయింది !
   మరెప్పుడూ ఆ దరిదాపులకి కూడా రాలేదు !
   అప్పటి నుండి అడవి జంతువులు ఎప్పటి లాగే హాయిగా జీవించ సాగేయి ! 

11, సెప్టెంబర్ 2014, గురువారం

కుందేలు త్యాగం !


ఒక మండు వేసవి కాలంలో అడవి జంతువులన్నీ ఎక్కడా త్రాగడానికి చుక్క నీరు లేక, విలవిలలాడి పోయాయి.గుక్కెడు నీళ్ళ కోసం అవి , అడివంతా జల్లెడ వేసి గాలించాయి.ఎక్కడా చుక్క నీళ్ళు కనిపించ లేదు ! అడవి జంతువులలో కాస్త వయసు పైబడ్డ  పెద్ద జంతువులు బాధగా ఇలా అన్నాయి : ‘‘పుట్టి బుద్ధెరిగి,ఇంతటి దారుణమైన వేసవి కాలాన్ని ఎప్పుడూ చూడ లేదు! ’’ అని.
     జంతువులన్నీ నీళ్ళ కోసం వెతుకుతూ అడవి సరిహద్దులు విడిచి, చివరకి గ్రామాల మీద పడ్డాయి. గ్రామ ప్రజల చేతిలో చావుని కొని తెచ్చు టున్నాయి.రోజు రోజుకీ నీళ్ళ కోసం ఊళ్ళ మీద పడిన జంతువులు ఒక్కొక్క టీ జనాల చేతికి చిక్కి మరణిస్తున్నాయి. అడవి జంతువులకి ఏం చేయాలో తోచ లేదు.
     ఒక రోజు జంతువులన్నీ అడవిలో ఒక చోట  సమావేశ మయ్యాయి. తమలో తాము ఇలా చర్చించు కున్నాయి :
      ‘‘ మనందరికీ చావు మూడినట్టుగా ఉంది.నీరు లేక పోతే బ్రతకలేం కదా !
నీటి కోసం గ్రామాల మీద పడిన వాళ్ళలో ,మనవాళ్ళు ఇప్పటికే చావు కొని తెచ్చు కున్నారు. ఇక ఇక్కడ ఉండ లేం  బాబూ !   అలా అని, అడవిని విడిచి ఎక్కడికీ వెళ్ళ లేం !  ఏం చేయాలో తోచడం లేదు !’’ అంది పులి విచారంగా.
    తక్కిన జంతువులన్నీ అవునంటే అవునని పెద్ద పెట్టున ఏడవడం మొదలు పెట్టాయి.
    ‘‘ మన పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది కనుక, ఇక మనం అందరం కలసి ఒకే సారి ఆత్మ హత్యలు చేసు కోవడం మంచిదని నాకు అనిపిస్తోంది ..’’ అంది ఏనుగు.
    ఒక్క కుందేలు తప్ప,  తతిమ్మా జంతువులన్నీ అలా చేయడం తప్ప మరో దారి లేదంటూ అంగీకరించాయి. ఏక కంఠంతో హాహాకారాలు చేసాయి. వాటి ఏడుపులతో అడవి దద్దరిల్లి పోయింది !
      ఇంతలో కుందేలు తల పైకెత్తి ,  ఆకాశం వంక చూసింది.
       ఆకాశం లోకి చూస్తూ అంది : ‘‘ ఆగండాగండి ! మీ ఏడుపులు ఆపండి !
అదిగో !ఆకాశంలోమబ్బు తునక కనబడుతోంది !ఎప్పుడు కురుస్తుందో
 అడుగుదాం ..’’  అని అరిచింది.
       అడవి జంతవులన్నీ దుఃఖం దిగమ్రింగుకుని, తలలు పైకెత్తి ఆకాశం లోకి చూసాయి. అక్కడో చిన్న మబ్బు తునక వాటికి కనిపించింది.
   ‘‘ మబ్బు తునకా ! మబ్బుతునకా !  మా అడవిలో ఎప్పుడు కురుస్తావో
చెప్పవూ ?!’’ దీనంగా అడిగింది జింక.
‘‘ అయ్యో ! కురిసేటంత శక్తి నాకు లేదు ! నేను వొట్టి తెల్ల మబ్బును.నాతో నీటిని తెచ్చు కోలేదు.మరి, నేనెలా కురవ గలనూ ? నేను వెళ్ళి, మా కర్రి మబ్బు అన్నతో మీరు పడుతున్న కష్టాల గురించి చెబుతాను. అతను వచ్చి, మీకు కావలసినంత నీటిని కురిపిస్తాడు లెండి !’’ అంది మబ్బు తునక. అని భరోసా ఇచ్చి , అక్కడి నుండి కదలి పోయింది.
    మబ్బు తునక వెళ్ళి చాలా రోజులయినా, కర్రి మబ్బు వచ్చే జాడ కనిపించ లేదు. అడవి జంతువులన్నీ ఆందోళన పడసాగేయి. ఆశ వదులు కున్నాయి.
‘‘ ఇక మన చావు ఖాయం. మబ్బు తునక మనల్ని మోసం చేసింది. చచ్చే వాళ్ళని చావనివ్వకుండా , మనం మరిన్ని రోజులు బతికేలా చేసింది. కష్టాలు అనుభవించేలా చేసింది. మనకింక వాన కోసం ఎదురు చూసే ఓపిక లేదు !
ఈ మబ్బులని నమ్మ లేం !  ఇక మనకు సామూహిక ఆత్మ హత్యలే గతి !’’ అనుకున్నాయి. ఆత్మ మత్యలు చేసు కోడానికి సిద్ధ సడ్డాయి.
   కుందేలు వారించింది : ‘‘సరే, నాకు ఆఖరి అవకాశం ఇవ్వండి ...నేను దూర ప్రాంతాలకు వెళ్ళి, కర్రి మబ్బు వస్తోందేమో చూసి వస్తాను ... అయితే, నేను తిరిగి వచ్చే వరకూ మీరు ఎలాంటి అఘాయిత్యాలకూ పాల్పడమని నాకు మాట ఇవ్వండి.’’ అంది. ఎలాగో అతి కష్టం మీద వాటిని  ఆత్మ హత్యలు చేసుకో కుండా కుండా ఆపగలిగింది.
   అడవి జంతువులన్నీ వంతుల వారీగా నీటి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ దగ్గర లోని గ్రామాలకు వెళ్ళి రాసాగేయి.
    కుందేలు వెళ్ళి చాలా రోజులు గడిచాయి. అడవి జంతువుల కష్టాలు నానాటికీ ఎక్కవయింది. ఒక ప్రక్క నీటికి కటకట. బతకడం దుర్భరమైపోతోంది. చద్దామంటే, తను తిరిగొచ్చే వరకూ ఆత్మ హత్యలు చేసుకో వద్దని కుందేలు తమ వద్ద మాట తీసుకుందాయె !  ఏం చేలాలో వాటికి తోచ లేదు.
   అలాగే ప్రాణాలు ఉగ్గ బెట్టుకుని రోజులు వెళ్ళ దీసాయి.
    కుందేలు రాక కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూడసాగేయి.
     అది వస్తుందన్న ఆశ నానాటికీ సడలి పోతోంది.
      కానీ , అదొచ్చే వరకూ ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు !
       ఇలా ఉండగా,  వానా కాలం రానే వచ్చింది.
        ఎక్కడి నుండో  కర్రి మబ్బులు కమ్ముకుని వచ్చి, చాలా రోజుల తరువాత అడవిలో విస్తారంగా వానలు కురిపించాయి !  అడవి జంతువుల ఆనందం అంతా ఇంతా కాదు ! తమ ఆపద అలా గట్టెక్కాక, అవి హమ్మయ్య అనుకుని, ఇక కుందేలు రాక కోసం ఆత్రంగా ఎదురు చూడ సాగేయి.
      చిన్ని కుందేలు మాత్రం అక్కడికి మరింక తిరిగి రాలేదు !
      ఏమై పోయిందో ఎవరికీ తెలియదు.
       వేసవి గడచి, మళ్ళీ వర్షా కాలం వచ్చే వరకూ, ఆశ కల్పించి, తమని బ్రతికిండం కోసమే  అది తన ప్రియమైన అడవిని వదిలి ఎక్కడికో వెళ్ళి పోయిందని వాటికి తెలియదు !!!                     

10, సెప్టెంబర్ 2014, బుధవారం

దేవుడ్ని చూసిన వాడు !


నంది వర్ధన పురంలో గంగాధరుడనే కుర్రాడు ఉండే వాడు, వాడికి ఓ ముసలి అవ్వ తప్పితే వెనుకా ముందూ ఎవరూ లేరు.బడికి పోయే వాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండే వాడు.అర్ధం పర్ధంలేని ప్రశ్నలు అడుగుతూ అందరినీ విసిగిస్తూ ఉండే వాడు. వాడు వేసే తలా తోకా లేని ప్రశ్నలకి ఊళ్ళో అందరూ విసిగి పోయి, వాడంటేనే చిరాకు పడే వారు. 
      రామయ్య అనే ఒక ముసలి రైతుకి మాత్రం వాడంటే ఇష్టం.  అమ్మా నాన్నా లేని పిల్లాడని వాడంటే  అమితమైన జాలి చూపిస్తూ ఉండే వాడు. వాడిని ఎలాగయినా ఓ దారికి తీసుకుని రావాలని రామయ్యకి కోరికగా ఉండేది. కానీ గంగాధరుడు మాత్రం రామయ్య మాటని పెడ చెవిని పెట్టే వాడు.
    ఒక రోజు రామయ్య తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా, గంగాధరుడు అక్కడికి వచ్చేడు. వస్తూనే, ‘‘ తాతా ! అంతలా అలసి పోతూ పని చేయక పోతే ఏం !’’ అంటూ తన సహజ ధోణిలో అడిగాడు.దానికి రామయ్య  ‘‘ మంచి వాడివే !
పొలం దున్నాలి .. ఎరువులు వేయాలి ... విత్తాలి ... కలుపు తీయాలి .. కోతలు కోయాలి ... కుప్పలు కూర్చాలి ... వడ్లు దంచాలి ... అన్నం వండాలి ...ఇంత చేస్తేనే కదా, నోటికి అన్నం ముద్ద దక్కేది. ఊరికే కూర్చుంటే ఎలాగురా ! నీలా తిని  బలాదూరుగా తిరిగితే నోట్లో మట్టేరా, నాయనా !’’ అన్నాడు.
‘‘ అబ్బో, చాలా తతంగం ఉందే ! కష్ట పడకుండా తిండి దొరికే మార్గం ఏదీ లేదంటావా  తాతా? ’’ అనడిగేడు గంగాధరుడు.
‘‘ నాకయితే తెలియదు కానీ, దూరన ఉండే  ఆ గుడిలో శివయ్య ఉన్నాడు కదా, .. అతనేమయినా చెబుతాడేమో కనుక్కో ! కనుక్కుని వచ్చేక అతడు ఏమన్నదీ నాతో తిరిగి చెప్పాలి సుమా !’’ అన్నాడు రామయ్య.
   కష్ట పడకుండా తిండి దొరికే మార్గం గుడిలో శివయ్య చెబుతాడని ఆశతో ఆనందంగా గుడి వేపు పరుగు తీసాడు గంగాధరుడు. గుడిలో  ఉలుకూ పలుకూ లేని శివ లింగాన్ని చూసేక వాడి ఆనందం నీరు కారి పోయింది. వెంటనే పరుగు పరుగున తిరిగి రామయ్య దగ్గరకి వచ్చి, ‘‘నువ్వు నాకు అన్నీ అబద్ధాలే చెప్పావు! గుడిలో లింగమే తప్ప, శివయ్య లేడు. ’’ అన్నాడు కోపంగా.
     అందుకు రామయ్య నవ్వి, ‘‘ అదేమిటి ! శివయ్య అక్కడే ఉన్నాడట కదా !
నువ్వు వచ్చి ఏమీ అడగకుండానే వెళ్ళి పోయావని నాతో చెప్పాడు కూడానూ !’’ అన్నాడు.  ఆ మాటలతో గంగాధరుడికి ఉడుకుమోతు తనం వచ్చింది. మళ్ళీ  అంత దూరమూ ఆయాస పడుతూ గుడికి పరిగెత్తాడు. ఈ సారి కూడా వాడికి శివయ్య కనిపించ లేదు ! ఎంత పిలిచినా పలక లేదు ! దానితో తిరిగి ఆయాస పడుతూ రామయ్య దగ్గరకి వచ్చేడు.  ‘‘ నీవన్నీ ఉత్త మాటలు ! గుడిలో శివయ్య లేనే లేడు ! నీకు కనిపించిన వాడు నాకెందుకు కనిపించడు ?’’ అన్నాడు కోపంగా.
    దానికి రామయ్య నవ్వుతూ ‘‘నేను పొద్దుటి నుండీ పొలంలో వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తున్నాను. నువ్వు ఏ పనీ చేయడం లేదు. కష్ట పడి పని చేసే వాళ్ళంటేనే శివయ్యకి ఇష్టం కాబోలు ! అందుకే, నాకు కనిపించిన వాడు నీకు కనిపించడం లేదు ! ’’ అన్నాడు.
    ఆ మాటలు గంగాధరుడి మీద బాగా పని చేసాయి. ఆ రోజు నుండీ వాడిలో చాలా మార్పు వచ్చింది. ఒళ్ళు వంచి పని చేయ సాగేడు.బడికి వెళ్ళి, శ్రద్ధగా చదువు కోవడం మొదలు పెట్టాడు. త్వరలోనే ఊళ్ళో అందరి దగ్గరా  గంగాధరుడు బుద్ధి మంతుడనే పేరు తెచ్చు కున్నాడు !
     ఆ తర్వాత ఓ రోజు రామయ్య గంగాధరుడు కనబడితే అడిగాడు ‘‘ ఇంతకీ నీకు శివయ్య ఇప్పటికయినా కనిపించేడూ ?!’’ అని.
    దానికి గంగాధరుడు  ‘‘లేదు కానీ తాతాతాతా ! శ్రమలోనే దేవుడున్నాడని తెలిసింది. శ్రమించే వారికీ, పేదలకి సాయం చేసే వారికీ ఆ శివయ్య వెన్నంటే ఉంటాడని తెలిసింది !’’ అన్నాడు తను కూడా నవ్వుతూ.
      దానికి రామయ్య - 
    ‘‘ ఇప్పుడు నచ్చేవురా! భడవా, ఏదీ ఒక ముద్దియ్యి ! ’’ అన్నాడు !