31, అక్టోబర్ 2014, శుక్రవారం

కుక్క కాటుకి చెప్పు దెబ్బ !


కంటకా పల్లిలో నారాయణడనే వాడు ఉండే వాడు. అతడు వట్టి జగడాలమారి.  అందరితోనూ నిష్కారణంగా ఎందుకో ఒకందుకు తగవులు పెట్టుకుంటూ ఉండే వాడు. అందు చేత అతనికి ఆ ఊర్లో స్నేహితులనే వారే లేకుండా పోయేరు,.
      ఇలా ఉండగా, ఒక రోజు నారాయణ ప్రక్క ఇంటి లోకి ఆనందుడు అనే వ్యక్తి అద్దెకి దిగాడు. అతనికి నారాయణ గురించి మీ తెలియక పోవడంతో,  అతనిని పలుకరిద్దామని  గోడ మీ నుండి నారాయణ ఇంటి వేపు చూసేడు.  ఆ రోజు నారాయణ ఇంట్లో ఏదో శుభ కార్యం జరుగుతోంది.  ఇంట్లో పిండి వంటలు వండు తున్నారు. ఆ ఘుమఘుమలు ఆనందుని ముక్కు పుటాలకు తగిలాయి.  ఇంతలో నారాయణ ఇంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఆనందుడు తనను తాను అతనికి పరిచయం చేసు కుంటూ ఇలా అన్నాడు : ‘‘ మేము ఈ దినమే
ఈ ఇంట్లో అద్దెకు దిగాము.  నా పేరు ఆనందుడు, మీతో పరిచయం కోరు కుంటున్నాను.  ఇవాళ మీ ఇంట్లో ఏదో విశేషం ఉన్నట్టుగా ఉందే !  వంటకాల వాసనలు కమ్మగా  ముక్కుకి తగులు తున్నాయి !మా ఆవిడా పిల్లలూ కూడా అదే అంటున్నారు ! ’’ అన్నాడు మెచ్చుకోలుగా.
      అంతే ! నారాయణ ఉగ్రరూపం ధరించాడు !శివాలెత్తి పోయేడు.  ‘‘ మేం ఎంతో ఖర్చు చేసి పదార్ధాలు తెచ్చుకుని వంటలు చేసుకుంటూ ఉంటే, వాటి వాసలు పీల్చి మీరంతా కడుపు నింపు కుంటున్నారా ? ! సిగ్గు లేదూ ! మా వంటల వాసనలు పీలిస్తే, మా వంటలు మెక్కి నట్టే ! అంచేత, మీ తిండికి అయిన  ఖర్చంతా ఇచ్చి తీర వలసినదే ! ’’ అంటూ గొడవ చేసాడు.  ఆ మాటలతో ఆనందుడికి తల తిరిగి పోయింది.  నోట మాట రాలేదు. చాలా సేపు ఇద్దరి మధ్యా గొడవ జరిగేక,  వాళ్ళూ వీళ్ళూ కలుగ జేసుకుని సర్ది చెప్పడంతో  అప్పటికి ఆ తగువు  సద్దు మణిగింది.  ఆనందుడు తన జీవితంలో ఇలాంటి జగడాలమారిని చూడ లేదనుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళి పోయేడు. ఎలాగయినా, నారాయణకి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించు కున్నాడు.
      ఆ తర్వాత ఓ  దినం ఆనందుడు బజారు వీధిలో ఎండ వేళ  ఒక చోట నిలబడి ఉండగా,  ఏదో పని మీద అక్కడికే వచ్చిన నారాయణ కూడా అతని ప్రక్కనే నిలబడ వలసి వచ్చింది.  అంతే  !  ఆనందుడు అతని చెంప ఛెల్లు మనిపించాడు ! అంతటితో ఆగకుండా ఇలా అరవడం మొదలు పెట్టాడు :
‘‘ బుద్ధి లేదూ ! నా మీద కాలు పెట్టి నిలుచుంటావా ! నా నీడ మీద కాలు పెట్టి నిలుచున్నావంటే, నా మీద కాలు పెట్టి నిలుచున్నట్టే.  నా నీడను త్రొక్కితే నన్ను త్రొక్కినట్టే.  నా నీడను అవమానిస్తే నన్ను అవమానించినట్టే ...’’ అంటూనే మరి రెండు దెబ్బలు వేసాడు. అనుకోని ఈ సంఘటని నారాయణ బిక్క చచ్చి పోయేడు. చుట్టూ జనం సోగయి, ఏం జరిగింటూ అడిగారు.  ఆనందుడు  లోగడ తన ఇంటి వంటకాల వాసనల గురించి నారాయణ తనతో గొడవ పెట్టుకోడం గురించి  చెప్పి. వారితో ఇలా అన్నాడు : ‘‘చూడండి ! ఇతగాడు నా నీడను త్రొక్కి  నిలబడ్డాడు. అంటే నన్ను అవమానించి నట్టే కదా ! అందుకే  కొట్టేను ! ’’ అన్నాడు.    అతని మాటల్లోని అంతరార్ధం అర్ధమై  ‘‘ కుక్క కాటుకి చెప్పు దెబ్బ !’’ అనుకుంటూ అందరూ గొల్లున నవ్వేరు. నారాయణని తిట్టి పోసారు.  దాంతో  నారాయణకి పొగరంతా అణగి పోయింది. అప్పటి నుండి , తన ధోరణి మార్చు కున్నాడు. 
    నోరు మంచి దయితే , ఊరు మంచి దవుతుందంటారు కదా !
    ఇప్పుడు నారాయణకి ఊరంతా స్నేహితులే తెలుసా !!


29, అక్టోబర్ 2014, బుధవారం

గుణ పాఠం !


మానాపురం అనే ఊళ్ళో భూమయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండే వాడు. అతనికి లెక్క లేనంత సిరి సంపదలు ఉండేవి. కాని, పరమ లోభి. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టే వాడు కాదు.అయితే, అతడు తన పిసినారి తనాన్ని పది మంది ముందూ వెల్లడి కాకుండా జాగ్రత్త పడే వాడు.
   ఒక సారి అతని దగ్గరకి రామయ్య అనే పేద  రైతు వచ్చి, తన కుమార్తె పెళ్ళికి వెయ్యి రాపాయలు  తక్కువ పడ్డాయనీ, అంచేత వో వెయ్యి రూపాయలు అప్పుగా ఇమ్మని అర్ధించాడు. ఆ సమయంలో భూమయ్య చుట్టూ ఊరి పెద్దలు చాలా మంది కూర్చుని ఉన్నారు.  అందరి మధ్య  రామయ్యని లేదు పొమ్మనడం కుదరక, భూమయ్య ఇరుకున పడ్డాడు. మింగా లేక, కక్కా లేక తన భావాలను ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు.
    రామయ్య అడిగిన వెయ్యి రూసాయలూ అతనికి ఇస్తూ ఇలా న్నాడు : ‘‘దానిదేముంది రామయ్యా ! ఈ డబ్బుతో నీ కూతురి పెళ్ళి జరిపించు. నాకు నువ్వు వడ్డీ ఇవ్వ నవసరం లేదు. అసలు కూడా, నీ దగ్గర ఎప్పుడు కలిగితే అప్పుడే తెచ్చియఇవ్వు. తొందరేమీ లేదులే ! నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నా బాకీ తీర్చ వచ్చును. పోయి రా !’’ అన్నాడు ఎంతో దయగా. భూమయ్య మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ అతని మంచి తనాన్ని ఎంతగానో పొగిడారు !
    భూమయ్య ఇంట్లో పని చేసే  గోపాలుడు అనే నౌకరు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తూనే న్నాడు. వాడికి తన యజమాని మాటలు నమ్మ బుద్ధి కాలేదు. బయటకి మంచి తనం చూపిస్తున్నా, యజమాని మనసులో ఏదో దురూహ ఉండే ఉంటుందని వాడు అనుమానించాడు.
     వాడు అనుమానించి నట్టే అయింది ! ఆ మర్నాడే భూమయ్య నౌకరు గోపాలుడిని పిలిచి ఇలా చెప్పాడు : ‘‘ నువ్వు వెంటనే రామయ్య ఇంటికి వెళ్ళు. అనుకోని అవసరం వచ్చి పడింది. అతనికి నేను నిన్న ఇచ్చిన వెయ్యి రూపాయలలో నాలుగు వందల రూపాయలు అడిగి తీసుకురా ! సాయంత్రానికి తిరిగి ఇస్తానని చెప్పు. రమయ్య కూతురి పెళ్ళికి ఇంకా  వారం రోజుల వ్యవధి ఉంది కదా ! ’’ అన్నాడు. గోపాలుడికి  యజమాని ఎత్తు తెలిసి పోయింది. చేసేది లేక, రామయ్య దగ్గరికి వెళ్ళి ,యజమాని చెప్పి నట్టే చెప్పాడు. రామయ్య ఇచ్చిన నాలుగు వందలూ తెచ్చి భూమయ్య చేతికి ఇచ్చేడు.  మరుచటి దినం కూడా మరో సాకుతో  మరో రెండు వందలు తెప్పించు కున్నాడు భూమయ్య. భూమయ్యకి ఏం అవసరం వచ్చిందో , పాపం ! అను కున్నాడే కానీ రామయ్యకి అతని మీద అనుమానం రాలేదు. పెళ్ళికి ఇంకా వ్యవధి ఉంది కనుక భూమయ్య  వెనక్కి తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాడనే నమ్మాడు రామయ్య. మూడో నాడు భూమయ్యే నేరుగా రామయ్య ఇంటికి వచ్చి, కన్నీళ్ళు పెట్టుకుని ఏదో కారణం చెప్పి ఆ సాయంత్రమే మొత్తం వెయ్యి రూపాయలూ మళ్ళీ ఇస్తానని చెప్పి  నాలుగు వందలు తీసుకుని పోయేడు ! దీనితో రాయ్యకి ఇచ్చిన వెయ్యి రూపాయలూ తిరిగి భూమయ్య తీసుకున్నట్టయింది ! ఆ సాయంత్రం కాదు కదా, మర్నాడు కూడా భూమయ్య అతనికి డబ్బు సర్దుబాటు చెయ్యనే లేదు. దానితో రామయ్య కళ్ళ నీళ్ళపర్యంత మయ్యేడు. ఇదంతా గమనిస్తున్న గోపాలుడు యజమాని నీచత్వాన్ని అసహ్యించుకున్నాడు.
    తన యజమానికి ఎలాగయినతా గుణపాఠం నేర్పాలని గట్టిగా అనుకున్నాడు ఆ రోజు రాత్రి భోజనాల వేళ భూమయ్య విస్తట్లో గోపాలుడు అన్ని పదార్ధాలూ వడ్డించేడు. తీరా యజమాని తిన బోతూ ఉంటే, ఆగమని చెప్పి,ఉప్పు తక్కువయిందనో, పులుపు చాల లేదనో, కారం వెయ్యడం మరచి పోయాననో చెబుతూ అతని వస్తట్లో నుండి ఒక్కో పదార్ధమూ తీసెయ్యడం మొదలు పెట్టాడు ! చివరకి విస్తరంతా ఖాళీ అయింది ! గోపాలుడు మళ్ళీ పదార్ధాలను వడ్డిస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడు భూమయ్య. కానీ ఎంత సేపు ఎదురు చూసినా, వడ్డంచడే !  దాంతో భూమయ్య కోపంతో ఊగి పోయాడు. ‘‘ విస్తట్లో వడ్డించి నట్టే వడ్డించి ,అన్నీ తీసేస్తా వేమిట్రా గాడిదా ! ’’ అంటూ గోపాలుడిని కొట్టడానికి చేయెత్తాడు. కానీ , అంత లోనే అతనికి గోపాలుడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనసుకి తట్టింది. రామయ్యకి తను చేసిన ద్రోహానికి ఇది ప్రతీకారమని  అతను గ్రహించాడు !  సిగ్గుతో తల దించు కున్నాడు.
ఆ మర్నాడే రామయ్యని పిలిపించి, అతని కుమార్తె పెళ్ళికి డబ్బు సర్దుబాటు చేసాడు ! అంతే కాక, వధువు చేతిలో విలువైన కానుకలు ఉంచి శీర్వదించేడు !
  ఆ నాటి నుండీ భూమయ్యలో పిసినారి తనం కలికానికి కూడా కనిపించ లేదు !

26, అక్టోబర్ 2014, ఆదివారం

రామయ్య, సోమయ్యల కథ !


అనగా అనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే అన్నదమ్ములు ఉండే వారు. వారిలో రామయ్య పేదరికంతో బాధ పడుతూ ఉండే వాడు. ఒక చిన్న గుడిసెలో సాదాసీదా జీవితం గడుపుతూ ఉండే వాడు. సోమయ్య మాత్రం వ్యవసాయం మీదా, వ్యాపారాల మీదా బాగా సంపాదించి,  విలాసవంతమయిన జీవితం గడుపుతూ ఉండే వాడు. పెద్ద భవంతి కట్టుకుని అందులో భార్యా పిల్లలతో దర్జాగా గడుపుతూ ఉండే వాడు. రామయ్య  భార్య ఒంటి మీద ఒక్క పసుపు తాడు తప్ప వెండి బంగారాలేమీ ఉండేవి కావు. పిల్లలకి కూడా మంచి బట్టలు ఉండేవి కావు.  అయినా సరే,  ఆ కుటుంబంలోని వారంతా  ఏ విచారమూ లేనట్టుగా ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండే వారు. నిత్యం ఆనందంగానే కాక, పూర్తి ఆరోగ్యంగా కూడా ఉండే వారు.
       సోమయ్య  కుటుంబం మాత్రం ఎంత సంపద న్నా సరే నిత్యం ఏదో అసంతృప్తితో రగిలి పోతూ ఉండేది.  అతని భార్యకు ఎన్ని నగలు, ఎన్ని చీరలు  ఉన్నా, ఇంకా చాలవని భర్తను వేధిస్తూ ఉండేది.అతని పిల్లలు కూడా దుబారా ఖర్చులకు అలవాటు పడడంతో ఎంత డబ్బూ చాలేది కాదు. రోజూ ఇంట్లో  అంతా దేనికో ఒకదానికి గొడవ పడుతూ ఉండే వారు.  అంతే కాదు, తరచుగా వారు ఏదో ఒక రోగాన పడుతూ ఉండే వారు. రామయ్య ఇంటికి వచ్చిన అతిథులకు కలిగినంతలో పెట్టి తృప్తి పరచి పంపుతూ ఉండే వాడు. సోమయ్య  సంగతి తెలిసి ఆ ఇంటికి ఎవరూ వచ్చే వారు కాదు. అంత పెద్ద భవనమూ బోసి పోయి ఉండేది.
      ఏమీ లేక పోయినా,  అన్నగారి కుటుంబం అంత ఆనందంగా ఎలా ఉండ గలుగుతోందో తెలుసు కోవాలని  సోమయ్యకు కుతూహలంగా ఉండేది. అయితే, డబ్బుందనే అహంకారంతో  బంధుత్వాన్ని ప్రక్కన పెట్టిన సోమయ్యకు  అన్న గారిని ఆ విషయం అడగడానికి ముఖం చెల్లేది కాదు !
    ఇలా ఉండగా, ఒక రోజు మునిమాపు వేళ రామయ్య దారంట పోతూ ఉంటే, అతని కాలిలో ముల్లు గుచ్చకుంది. బాధతో ‘‘ అమ్మా !’’ అని, అంత లోనే తేరుకుని, ముఖంలో ప్రశాంతత తెచ్చుకున్నాడు. ఇదంతా అతని వెనుకగా  నడచి వస్తున్న   సోమయ్య కంట పడింది. ఆశ్చర్య పోయాడు ! ఇక ఉండబ్టట లేక, అన్న గారిని ముల్లు గుచ్చుకున్న బాధను అంత లేనే ఎలా మరచి పోగలిగావని అడిగాడు.
    దానికి రామయ్య నవ్వుతూ  ఇలా అన్నాడు : ‘‘ముల్లు గుచ్చు కుంటే ఎవరికయినా బాధ కలగడం సహజమే తమ్ముడూ ! కానీ ఇప్పుడు నాకీ ముల్లు కాలిలో గుచ్చు కుంది కానీ , కంట్లో గుచ్చుకో లేదు కదా ! అనే ఆలోచన వచ్చింది. అందుకే క్షణంలో నా బాధంతా చేత్తో తీసి పారేసినట్టయింది! ’’ అనిచెప్పాడు.
     అన్న గారి కుటుంబం అంత ఆనందంగా ఎలా ఉండ గలుగుతోందో  ఆ మాటలతో అర్ధమయింది సోమయ్యకి ! కలిగినంతలో తృప్తి పడడం, బాధలోనూ సుఖం వెతుక్కోడం వల్లనే తమ్ముడి కుటుంబం అంత ఆనందంగా ఉంటోందని అతనికి అర్ధమయింది. అహంకారంతో అందరినీ దూరం చేసు కోకుండా, నలుగురితో కలిసి మెలసి ఉంటే , ఆ యింట సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని కూడా గ్రహించాడు.      ఆ రోజు నుండీ  సోమయ్యలో మంచి మార్పువచ్చింది., భార్యా పిల్లలకి నచ్చ చెప్పివారిలో  కూడా మంచి మార్పు తీసుకొచ్చేడు. అన్న గారి కుటుంబంతో చక్కగా రాకపోకలు సాగించేడు.    
  ఇప్పుడు ఆ అన్నదమ్ముల అన్యోన్యతని మెచ్చుకోని వారంటూ  లేరు ! 

24, అక్టోబర్ 2014, శుక్రవారం

తిరగబడిన చిలుక తల్లి జోస్యం !


చిలకలపల్లిఅడవిలో పచ్చని చెట్లు విస్తారంగా ఉన్నాయి. వాటి మీద లెక్క లేనన్ని చిలకలు నివసిస్తూ ఉండేవి. అవి చేసే సందడి అంతా యింతా  కాదు ! తియ్య తియ్యని పండ్లను తింటూ, చిలుక పలుకులు పలుకుతూ అవి హాయిగా బ్రతుకుతూ ఉండేవి.
     వాటిలో ఒక కొంటె చిలుక కూడా ఉండేది. దాని చిలిపితనం చెప్పతరం కాదు !
ఎప్పుడూ ఏదో చిలిపి చేష్ట చేస్తూ,  తక్కిన వాటిని కడుపుబ్బా నవ్విస్తూ ఉండేది.  అది వయసులో అన్నిటికన్నా పెద్దది కావడం చేత, మిగతా చిలుకలన్నీ  దానిని ‘‘ చిలుక తల్లీ !’’ అని పిలుస్తూ ఉండేవి.  చిలుక తల్లి చేసే కొంటె పనులతో అవి ఒక్కో సారి అయోమయంలో పడిపోతూ ఉండేవి కూడా ! చిలుక తల్లి ఏవో అబద్ధాలు చెప్పి , వాటిని నమ్మిస్తూ ఉండేది. దాని  మాయ మాటలు విని అవి మోస పోతూ ఉండేవి. తన మాటకారితనంతో  వాటిని బురిడీ కొట్టించి వినోదించడం చిలుక తల్లికి ఒక వ్యసనంగా మారిపోయింది.
     ఒక్కో సారి ఫలానా తిథి నాడు భూ ప్రళయం వస్తుందని భయ పెట్టేది. మరోతూరి గ్రామం పొలిమేరల్లో ఉండే అగ్ని పర్వతం బ్రద్దలై పెను ముప్పు కలుగుతుందని హడలు కొట్టేది. ఇంకో సారి పదుల సంఖ్యలో బోయలు వచ్చి చిలుకల నన్నింటినీ ఉచ్చులు వేసి బంధించి తీసుకు పోనున్నారని అదర గొట్టేది. మరొక సారి , అడవి చెట్లన్నీ అకారణంగా కూలి పోయి, చిలుకలు తినడానికి ఒక్క పండూ మిగలదని జోస్యం చెప్పేది.  తీరా గడువు దాటి పోయినా ఏ ఆపదా కలగక పోవడంతో  చిలుకలు ఊపిరి పీల్చు కునేవి ! ఇలా  చిలుక తల్లి జోస్యం పేరుతో ఎన్ని సార్లు బెదర గొట్టినా,  ఆఅమాయకపు చిలుకలు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉండేవి !
     ఇలా ఉండగా, ఒక రోజు నిజంగానే ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చి. అక్కడి చిలుకలని పట్టుకోడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ వాడి చేతికి చిలుక తల్లి  చిక్కింది !  వాడు దానిని తీసుకుని పోయి, చెట్టు క్రింద చిలుక జోస్యం చెప్పే వాడికి అమ్మేసాడు. వాడు దాన్ని పంజరం లాంటి పెట్టెలో బంధించాడు. ఎగిరి పోకుండా రెక్కలు సన్నగా కత్తిరించాడు. పెట్టె మీద చేతి వేళ్ళతో తాను కొడుతూ ఉంటే , క్రింద  పరచి ఉంచిన కాగితాల కట్టలోంచి ఒక కాగితాన్ని ముక్కుతో తీసి ఇవ్వడం ఎలాగో దానికి తర్ఫీదు ఇచ్చేడు. ఇప్పుడు దాని పని ఆ జోస్యం  అబద్ధమని తెలిసినా కాగితాల కట్టలోంచి ఒక కాగితం తీసి ఇచ్చి, తిరిగి బుద్ధిగా పెట్టె లోకి దూరి పోవడమే అయింది ! కొంటె తనంతో నేస్తాలకి అబద్ధపు జోస్యాలు చెప్పి, అదరగొడుతూ ఉండే  చిలుక తల్లికి ఇప్పుడు నిజంగానే అబద్ధపు జోస్యం చెప్పే  దుస్థితి దాపురించింది !  అందుకది చింతిస్తూ ఉండేది. ఏమీ చేయ లేని అసహాయతతో అది కుమిలి పోతూ ఉండేది.
     ఇలా ఉండగా, ఒక రోజు అక్కడికి ఒక వీధి రౌడీ వచ్చేడు. వాడు లోగడ  అక్కడ చిలుక జోస్యం చెప్పించు కున్నాడు. ఆ జోస్యం ఏ మాత్రం నిజం కాలేదని వాడు కోపంతో ఊగి పోతూ అక్కడికి వచ్చేడు ! ఆగ్రహంతో నానా మాటలూ అంటూ వాడు చిలుక తల్లి ఉండే పెట్టెను కాలితో బలంగా ఒక్క తాపు తన్నేడు ! పెట్టెతో పాటూ దూరంగా ఎగిరి పడిన చిలుక తల్లికి వొళ్ళంతా బాగా గాయా లయ్యాయి.
    జోస్యం నెపంతో లోగడ అడవి లోని తోటి చిలుకలని తాను ఆటపట్టిస్తూ ఉండడం చిలుక తల్లికి గుర్తుకొచ్చింది. ఆ పాపమే ఇప్పుడు తనపాలిట శాపమయిందని అది ఎంతగానో విచారించింది !
    ఆపసోపాలు పడుతూ ఎలాగో తిరిగి అడవికి చేరుకుంది. అడవిలో చిలుకలన్నీ  దాని చుట్టూ చేరి జరగినదంతా అడిగి తెలుసు కున్నాయి.  చిలుక తల్లి ఏడుస్తూ జరిగినదంతా వివరించింది. అంతే కాదు, లోగడ తాను వాటితో   అబద్ధాలు కల్పించి చెప్పి , వాటిని వేళా కోళం చేసినందుకు పశ్చాత్తాప పడుతూ మన్నించమని వేడుకుంది.
 ‘‘అయ్యో ! అంతమాట లెందుకమ్మా ! మేము అవేవీ మనసులో ఉంచు కోములే !’’ అంటూ చిలుకలన్నీ అప్పటి నుండి చిలుక తల్లితో స్నేహంగా ఉంటూ గడపసాగేయి !
   ఇప్పుడు చిలకల పల్లి అడవిలో చిలుకల ఆటపాటల సందడి ఇంతా అంతా కాదు !
చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు తెలుసా !

22, అక్టోబర్ 2014, బుధవారం

కొత్త మిత్రం కుందేలు !



అనగా అనగా ఒక అడవిలో ఒక ఏనుగు, ఎలుగు బంటి, కోతి, గాడిద, ఎనుము, అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. అవి అలా స్నేహంగా ఉండడం ఒక జిత్తుల మారి నక్కకి నచ్చ లేదు. వాటి మధ్య ఏ తగాదాలూ లేకుండా హాయిగా ఉండడం చూసి ఆ తగవులమారి నక్క ఓర్చుకో లేక పోయింది ! అకారణ శతృత్వంతో వాటి నడుమ ఎలాగయినా చిచ్చు పెట్టి, వాటిని ఒకదాని కొకటి బద్ధ శత్రువులగా మారేలా చేయాలని అనుకుంది.
    ఒక రోజు ఏనుగు ఒంటరిగా ఉండడం చూసి ,అక్కడికి చేరి ఏనుగుతో ఇలా అంది : ‘‘  నీ  మిత్రులు నీ గురించి హేళనగా మాట్లాడు కుంటూ ఉంటే విన్నాను ! నువ్వు బలశాలివే కానీ , వొట్టి మంద మతివట ! నీకు తెలివితేటలు అనేవే
లేవుట ! వాళ్ళ వెటకారపు మాటలు విన లేక పోయాననుకో ! ’’అంది. దానితో ఏనుగుకి తన చిరకాల మిత్రుల మీద చెప్ప లేనంత కోపం వచ్చింది.  నక్క తరువాత ఎలుగు బంటి దగ్గరకు చేరి, ‘‘ నీ అంత అంద వికారి లోకంలోనే ఎవరూ లేరని నీ మిత్రులు  నీ వెనుక హేళన చేస్తున్నారు తెలుసా !నీ వొంటి నిండా అసహ్యంగా బొచ్చేనుట ! హవ్వ !నీ ఎదుట నిన్ను పొగుడుతూ, నీ వెనుక నిన్ను ఎంతలేసి మాట లంటున్నారో ! తలచు కుంటే కడుపు రగిలి పోతోంది ’’ అని చాడీలు చెప్పింది. దానితో లుగు బంటికి తక్కిన వాటి మీద అంతు లేని ఆగ్రహం కలిగింది. నక్క తన పాచిక పారి నందుకు లోలోన సంతోషిస్తూ తక్కిన వాటి దగ్గరకి కూడా వెళ్ళి ఇలాగే చాడీలు చెప్పి, వాటి మనసు విరిచేసింది. చపల చిత్తం కలదని కోతినీ, కర్ణ కఠోర మయిన గాత్రం కలదని గాడిదనీ, కారు నలుపూ, వికారపు శరీరం కలదని ఎనుమునూ ఎకసెక్కాలు ఆడుతున్నాయని  లవి ఒంటరిగా ఉన్నప్పుడు చాడీలు చెప్పింది. దానితో వాటికి ఒకదాని మీద ఒకదానికి చెప్ప లేనంత కోపం వచ్చింది. ఇలా వాటి మధ్య నిప్పును రాజేసి, అవి ఎలా తగవులాడుకుంటాయో చూద్దామని జిత్తుల మారి నక్క ఎదురు చూడసాగింది !
     ఇలా ఉండగా ఆ మిత్రులంతా ఒక రోజు ఒక చోట కలవడం తటస్థించింది. ఇంకేముంది ! వాటి మధ్య జగడం మొదలయింది. ఒక దాని నొకటి తీవ్రంగా దూషించు కోవడం మొదలెట్టాయి. ఇదంతా ఓ చెట్టు చాటు నుండి చూస్తూ నక్క సంబర పడుతోంది. రాను రాను వాటి మధ్య కలహం హెచ్చి, గాయాల పాలయ్యే పరిస్థితి వచ్చింది.
    ఇంతలో , ఎన్నాళ్ళనుండో వాటితో తను కూడా చెలిమి  చేయాలని అనుకుంటున్న ఒక కుందేలు అక్కడికి వచ్చింది. వాటి కలహం చూసి నివ్వెర పోయింది. చాలా బాధ పడింది. అతి కష్టం మీద వాటిని వారించింది,  వాటి కలహానికి కారణం అడిగి తెలుసు కుంది. తరువాత వాటితో లా అంది :
‘‘ చిరకాలంగా మీ అందరి స్నేహం చూసి ఎంతో ముచ్చట పడి,  నేను కూడా మీతో స్నేహం చెయ్యాలని వచ్చేను. తీరా, మీరేమో ఇలా కొట్టుకు ఛస్తున్నారు ! ఇదేం బాగు లేదు. ఇంత వరకూ మీరంతా ఒకరి లోపాలను ఒకరు ఎంచారని కదా తగవులాడు కుంన్నారు ?! ఇప్పుడు  మీ అందర లోపాలు తెలిసిన మరొక జంతువు ఉందని మీరు మరచి పోతున్నారు ! అది మీ లోపాలను అడివంతా చాటి చెప్పి, మీ పరువు తీయాలనుకుంటోంది. ఒకరికి తెలియకుండా మీలో మరొకరికి మీమీద చాడీలు చెప్పి, వినోదం చూస్తోంది ! అదిగో ! ఆ చెట్టు చాటున నక్కి
 ఉంది ! అది చెప్పినదే నిజమయితే ధైర్యంగా మీ ఎదుటికి వచ్చి చెప్పమనండి చూద్దాం !’’  అంది.
   దానితో కళ్ళు తెరచిన మిత్రులంతా ఒక్క సారిగా ఆ జిత్తుమారి నక్క మీదకి దాడి చేసి, దానిని అడవి నుండి దూరంగా తరిమి కొట్టాయి !
      ఆ రోజు నుండి కుందేలు వారికి కొత్త మిత్రమయింది !!

21, అక్టోబర్ 2014, మంగళవారం

తిండి పోతు వరదయ్య !


వెంకటాపురం అగ్రహారంలో వరదయ్య అనే వ్యక్తి ఒకడు ఉండే వాడు. వాడికి తాత తండ్రులు మిగిల్చి పోయిన ఆస్తి చెప్ప లేనంత ఉండేది. దాంతో ఏ పనీ చేయ కుండా సోమరిగా తిని కూర్చుంటూ ఉండే వాడు. వాడు గొప్ప భోజన ప్రియుడు ! ఆ భోజన ప్రియత్వం వాడిని క్రమేపీ తిండి పోతుగా మార్చేసింది! నిద్ర పోయేటప్పుడు తప్ప , మెళకువగా ఉండే సమయంలో దో తింటూ దవడ ఆడిస్తూ ఉండ వలసినదే ! అదీ ఇదీ అని కాదు. ఏది దొరికితే అది ఆబగా తినే వాడు. రుచీ పచీ లెక్కలోకి వచ్చేది కాదు. తిండి పదార్ధం దొరికితే చాలు, ఏదో నిథి దొరికి నట్టుగా సంబర పడి పోయే వాడు. డబ్బుకి కొదువ లేదు కనుక, వాడికి ఏ ఆహార పదార్థం కావాలన్నా చిటికెలో వచ్చి పడుతుడేవి.
    ఇలా అడ్డూ ఆపూ లేకుండా తింటూ ఉండడం వల్ల వాడికి అజీర్తి రోగం పట్టుకుంది ! అది కాస్త ముదిరి పోయి, ఒక్క మెతుకు నోట పెట్టు కున్నా అరిగేది కాదు. ఆ రోగంతో వాడు నానా అవస్థలూ పడ్డాడు. మునపటిలా సరైన తిండి లేక పోవడంతో విలవిలలాడి పోయేవాడు. చిక్కి శల్యమై పోయేడు. వాడికి దు:ఖం ఆగేది కాదు. తిండి తిన లేక పోతున్నానన్న విచారంతో వాడు కుమిలి పోయే వాడు. ఇక ఆ అజీర్తి బాధనీ, విపరీత మయిన కడుపు నొప్పినీ  భరించ లేక  ఒక రోజు ఆత్మ హత్య  చేసు కోవాలని అనుకుని  అడవి లోకి బయలు దేరాడు.
       అలా అడవిలో చాలా దూరం నడిచేక వాడికి తపస్సు చేసుకుంటూ ఒక ముని కనిపించేడు. వరదయ్య చేతులు జోడించి, తన బాధ ముని చెప్పు కోడానికి సిద్ధ పడ్డాడు. ముని కళ్ళు తెరచి, ‘‘ ఏం కావాలి నాయనా ! ’’ అనడిగేడు దయతో.
ముని అలా అడిగే సరికి వరదయ్య తన అజీర్తి రోగాన్నీ, కడుపు నొప్పినీ మరచి పోయి, ‘‘ స్వామీ ! నాకు నిత్యం పంచ భక్ష్య పరమాన్నాలు దొరికేలా  వరం అనుగ్రహించండి !’’ అని వేడు కున్నాడు. ముని సరే అని వరదయ్యని దీవించేడు.  వరదయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆత్మ హత్యా ప్రయత్నం మానుకుని ఇంటికి వెళ్ళి పోయేడు.
     ఇంట్లో అడుగు పెడుతూనే వాడికి తన ఇంట్లో లెక్క లేనన్ని పాత్రలలో మంచి మంచి భోజన పదార్ధాలు కనబడ్డాయి ! వాడి ఆశ్చర్యానికీ, సంతోషానికీ లెక్క లేకుండా పోయింది! కాస్సేపటికి ఆశ్చర్యం నుండి తేరుకుని వాటిని ఆబగా తిన బోయాడు . అప్పుడు చప్పున వాడికి తన అజీర్తి రోగం, కడుపు నొప్పి గుర్తు కొచ్చింది! ఒక్క ముద్ద నోట పెట్ట లేక పోయాడు. కడుపు నొప్పితో మెలి తిరిగి పోతూ మంచాన పడ్డాడు. కళ్ళెదుట అంత రుచి కరమయిన తిండి చెప్ప లేనంత కనబడుతున్నా, తిన లేని తన అవస్థకి వాడికి ఏడుపు ఆగింది కాదు.
     తిండీ తిప్పలూ లేక ఆ రాత్రి చాలా సేపటికి కానీ వాడికి నిద్ర పట్ట లేదు. కునుకు పట్టేక, కలలో ఆ ముని కనబడి వరదయ్యతో ఇలా చెప్పాడు :
 ‘‘ నాయనా ! నీ పరిస్థితి చూస్తూ ఉంటే జాలి కలుగుతోంది. ఏ పనీ చేయకుండా తింటూ కూచోడం మంచిది కాదు. అలాగే ఎవరికీ పెట్ట కుండా ఒక్కడివే తినడం కూడా తగదు. మితాహారం తీసు కుంటూ, దాన ధర్మాలు చేస్తూ, చక్కగా పని పాటలు  చేసుకుంటూ ఉండే నీ  ఆరోగ్యం కుదుట పడుతుంది !’’ అని హితవు చెప్పాడు.
    అప్పటి నుండి వరదయ్య లో చాలా మార్పు వచ్చింది. మితంగా తినడం, సోమరి తనం విడిచి పెట్టి పని చేయడం, ఇతరులకు సాయ పడుతూ దానధర్మాలు చేయడం అలవాటు చేసు కున్నాడు. దానితో వాడి అజీర్తి రోగం, కడుపు నొప్పీ తగ్గి పోయాయి. వాడి ఆరోగ్యం కుదుట పడింది.

   అంతే కాదు, ఇప్పుడు వాడికున్న ‘‘ తిండి పోతు వరదయ్య’’ అనే చెడ్డ పేరు కూడా తొలగి పోయింది !

10, అక్టోబర్ 2014, శుక్రవారం

రాజు గారి వేట వ్యసనం !!


నందన రాజ్యాన్ని నందుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండే వాడు. అతనికి వేట ఒక వ్యసనంగా మారింది. వేట నందుడికి ఎంత వ్యసనంగా మారిందంటే, రాజకార్యాలేవీ పట్టించు కోనంత ! ఏడాది పొడుగునా వేట కోసం మందీ మార్బలంతో అడవిలో విడిది చేసే వాడు. పరిపాలనను గాలి కొదిలీసేడు.
    రాజు గారి వేటంటే మాటలా ! అందమైన గుడారాలు, చవులూరించే వంటలు యారు చేయడానికి వంట వాళ్ళూ, రాజు గారిని ఉల్లాస పరిచేందుకు నాట్యకత్తెలు, సంగీత వాద్య కళాకారులు, విదూషకులూ, వందిమాగధులూ ... వాహ్ !
ఒకరేమిటి ! రాజు గారి వెంట అడవికి రాచ నగరంతా తరలి వెళ్ళేది. నందుడికి రాజ వైభవాలన్నీ అడవిలోనే అమరి పోయేవి ! ఇంకేం ! రాజ పాలన కుంటు పడింది. అస్సలు పట్టించు కోవడమే మానేసాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు. సామాన్య  ప్రజలు నానా అవస్థలూ పడే వారు.
     ఇలా ఉండగా, ఒక రోజు అడవిలో  వేటాడుతూ ,నందుడు దారి తప్పి పోయేడు. అతని పరివారమంతా బాగా వెనుకబడి పోయింది. రాజు ఒంటరిగా కీకారణ్యంలో చిక్కుకు పోయేడు ! చాలా దూరం నడచి నడచీ బాగా అలసి పోయేడు. ఆకలితో కడుపు దహించుకు పోసాగింది. దాహంతో నాలుక పిడచ కట్టుకు పోయింది. చిత్రంగా అడవి చెట్లన్నీ మ్రోడు వారి పోయాయి ! అడవి నందుడి కంటికి ఎడారిలా కనిపించ సాగింది ! ఎక్కడా తిండీ, నీరూ దొరికే సూచనలు లేవు. అలసట వల్ల నిద్ర ముంచు కొస్తోంది. రాజుకి దు:ఖం వచ్చింది. ఏడు పొక్కటే తరవాయి !
     ‘‘ దేవా ! గుక్కెడు నీళ్ళూ , పిడికెడు అన్నమూ ఇప్పించవయ్యా ! సుఖంగా నిద్ర పోయేందుకు సురక్షితమైన చోటు చూపించవయ్యా !’’ అని, గుర్తొచ్చిన దేవుళ్ళనందరినీ వేడు కున్నాడు.
    అడివంతా కలియ తిరిగాడు. రాజుకి మతి పోయింది. పచ్చగా ఉండే అడవంతా ఇప్పుడు వెలవెలబారి పోయి ఉంది. విరగ కాసే పళ్ళ చెట్లకు ఒక్క పండూ  కనిపించడం లేదు. రాజుకి ఆందోళన ఎక్కు వయింది . పిచ్చెత్తినట్టు అడవంతా తిరిగాడు. ఒకే ఒక్క చోట, ఒక చెట్టుకి ఒకే ఒక్క పండు కనిపించింది!
 రాజుకి ప్రాణం లేచొచ్చినట్టయింది. దానిని కోసుకుని తినబోయాడు. అంతలో
ఆ చెట్టు కింద కూర్చుని ఒక కుర్రాడు ఆకలికి ఏడుస్తూ కనిపించాడు. రాజుకి వాడిని చూసి జాలి వేసింది. ఆకలి బాధ చల్లార్చు కోవడం కోసం నోట పెట్టుకో బోతున్నఆ ఒక్క  పండుని వాడికి ఇచ్చేసాడు. వాడు ఆ పండు తిన్నాడో, లేదో, వెంటనే మాయమై పోయాడు ! రాజు ఆశ్చర్యానికి అంతు లేదు ! అంత లోనే అడవిలో చెట్లన్నీ మునుపటి లాగే పళ్ళతో కళకళలాడుతూ కనిపించాయి. కావలసిన పళ్ళని  కోసుకుని తిందామని రాజు అనుకుంటూ ఉండేంతలో విపరీత మయిన మంచు తుఫాను కురిసింది.  రాజు మంచులో తడిసి ముద్దయి పోయాడు, చలికి వణికి పోసాగేడు. ఒంతలో, ఒక ముసిలామె ఒక చెట్టు కింద చలికి వణికి పోతూ అతని కంట పడింది. రాజు జాలితో ఆమెకు తన ఒంటి మీద బట్ట తీసి ఇచ్చేడు. అంతే ! ఆమె వాటిని అందుకుందో, లేదో, అంత మంచు తుఫానూ మాయమై పోయింది. మళ్ళీ అడివంతా ఎప్పటి లాగే ప్రశాంతంగా ఉంది ! రాజు ఈ సారి మరింతగా ఆశ్చర్య పోయాడు. ఈ వింత మార్పులకి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ముందుకి నడిచాడు ఇంతలో. అడవిలో ఒక్క సారిగా దావాలం చెలరేగింది.  ఆ మంటల్లో ఒక కుందేలు చిక్కుకు పోయి, వివిలాడుతూ ఉండడం రాజు కంట పడింది. ఏ మాత్రం ఆలోచించ కుండా, రాజు  దయతో దానిని కాపాడి, అడవిలో వదిలేసాడు.
    అప్పుడు రాజుతో ఆకాశ వాణి ఇలా అంది : ‘‘ ఓ రాజా ! నీ వేట వ్యసనం వల్ల అడవి లోని జంతు జాలం నానాటికీ తగ్గిపోతోంది . నీ వల్ల, నీ పరివారం వల్ల అడివంతా నాశనమై పోతోంది. నీకిది తగదు సుమా !  అయితే, ఒక విషయం ! నువ్వు ఆకలితో ఏడుస్తున్న బాలుడికి , చలికి వణికి పోతున్న వృద్ధురాలికి, సాయం చేస్తున్నప్పుడు నీకు నీ ఆకలి దప్పులు కానీ, చలి బాధ కానీ గుర్తుకు రాలేదు ! అంటే, నువ్వు నీ రాజ ధర్మాన్ని పూర్తిగా మరచి పో లేదన్న మాట ! అలాగే. చేతికి చిక్కిన కుందేలుని కాపాడి వదిలి పెట్టావంటే, నీ వేట వ్యసనం నిన్ను ఇంకా పూర్తిగా నిర్దయుడిగా చేయ లేదన్నమాట.  నీలో ఇంకా రాజధర్మం, మానవత్వం మిగిలే ఉన్నాయి. ఒక్క నీ వేట వ్యసనం వల్ల నీకూ, నీ ప్రజలకీ అనర్ధం జరుగుతోంది. దానికి ప్రతీకగానే అడవిలో  పచ్చని చెట్లన్నీ అకస్మాత్తుగా మ్రోడు వారి పోవడం, మంచు తుఫాను కురియడం, దావానలం వ్యాపించడం మొదలైనవి జరిగాయి. ఈ విపరీతాలన్నీ నీకు కను విప్పు కలిగించడం కోసం
వన దేవత సృష్టించినవే ! అందు చేత, నువ్వు ఇక నయినా ఈ వేట వ్యసనాన్ని తగ్గించుకుని, నీ ప్రజలను చక్కగాపరిపాలించు ! నీ రాజ్యం లోని ప్రజల ఇక్కట్లు తొలిగించు. అది నీ ధర్మం ! ’’ అంది.      రాజుకి కనువిప్పు కలిగింది. ఇంతలో పరివారమంతా వెతుక్కుంటూ వచ్చి, రాజుని చేరారు.    ఆ నాటి నుండి, క్షత్రియ ధర్మంగా ఎప్పుడో తప్ప రాజు వేటకు రావడం లేదు.    అప్పటి నుండి నందుడి రాజ్యం సుభిక్ష మయింది !! సామాన్య ప్రజల సంతోషం ఇంతా అంతా కాదు!!

8, అక్టోబర్ 2014, బుధవారం

ముసలి చెట్టూ, మధుర ఫలాలూ


అబ్బో, ఇప్పటిదా ఆ చెట్టు ! వందల సంవత్సరాల వయసున్న చెట్టు కాదూ,అది !! కొంత మందయితే కొంత ఎక్కువ చేసి. భూమి పుట్టిన దగ్గర నుండీ ఆ చెట్టు అక్కడ ఉందంటూ ఉంటారు కూడానూ !వాళ్ళ మాటల కేం గానీ, అంత పాత కాలం నాటి చెట్టన్నమాట అది. చాలా ఏళ్ళ పాటు అది గుబురుగా పెరిగిన కొమ్మలతో, రెమ్మలతో విరగ కాసేది. పచ్చని వెడల్పయిన పెద్ద ఆకులతో అది ఆకుల కొండలా ఉండేది. దాని మీద రకరకాల పక్షులు కిలకిలారావాలు చేస్తూ  సందడి చేసేవి. ఎక్కడి నుండో వచ్చిన బాటసారులు ని కింద చేరి హాయిగా సేదతీరే వారు. దాని పళ్ళు ఎంత తీయగా ఉండే వంటే, ఎన్ని తిన్నా తనవి తీరేది కాదు !
    అలాంటిది, ఇప్పుడా చెట్టు ముసలిదై పోయింది. కొమ్మలు ఎండి పోయేయి. పచ్చదనం పోయి, మ్రోడులా తయారయింది.  ఆకులు రాలి పోవడంతో నీడ కూడా కరువయింది. పక్షులు వేరే చోటికి వెళ్ళి పోయేయి. ఇప్పుడు నీడ కోసం దాని కిందకి ఎవరూ రావడం లేదు. కాని రోజులు దాపురించాయి. కుక్కమూతి పిందెలు కాస్తున్నాయి.ఇవాళో రేపో అవి కూడా ఉండవు.  తన పరిస్థితి తలచుకుని చెట్టుకి దుఃఖం ఆగడం లేదు. చెట్టు యజమాని కొడుకులు ఇక ఆ చెట్టుని కలప కోసం, వంట చెరకు కోసం కొట్టెయ్యాలనుకున్నారు. ఈ తరం కుర్రాళ్ళు కదా ! యజమాని మాత్రం చాలా మంచి వాడు. చెట్టు మీద గొడ్డలి పడితే, తన మెడ మీద పడ్డట్టే అని కొడుకులని హెచ్చరించాడు. దానితో వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు.
    ఒక రోజు ఒక సాధువు ఆ చెట్టు దగ్గరకి వచ్చేడు. చెట్టు ఆ సాధువుతో తన గోడు వెళ్ళబోసు కుంది. మునపటిలా తాను ఎవరికీ పనికి రాకుండా పోతున్నానని కన్నీళ్ళు పెట్టుకుంది. తన పళ్ళు కూడా ఇంతకు ముందులా తియ్యగా లేక పోవడంతో ఎవరూ కనీసం కొరికి కూడా చేడడం లేదని ఏడుస్తూ చెప్పింది. 
సాధువు దాని బాధ అర్ధం చేసు కున్నాడు. దాని ఆవేదన తీరేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించాడు.
      ఆ  సాధువు ఒక పథకం ప్రకారం చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఒక వార్తను వ్యాపించేలా చేసాడు. ఆ వార్త సుడి గాలిలా అంతటా వ్యాపించింది, అదేమిటంటే,
ఆ ముసలి చెట్టు కాసే ఫలాలో కేవలం రోజుకి ఒక్కటి మాత్రం చాలా మహిమ కలది ! ఆ చెట్టు రోజుకి ఒక్క తియ్యనైన పండును మాత్రం ఇస్తోంది ! ఆ ఒక్క పంటూ ఎవరయితే తింటారో, వారికి సకల సంపదలూ సమకూరుతాయి ! సమస్త ఆరోగ్యాలూ చేకూరుతాయి ! పిల్లా పాపలతో కలకాలం హాయిగా ఉంటారు ! ఇదీ ఆ వార్త సారాంశం !
   మునుపటిలా ఆ చెట్టు పళ్ళు తియ్యగా లేక పోయినా,వాటిలో ఏది మహిమ గల పండో తెలియక, జనం చేతికి దొరికిన దానిని ఆత్రంగా కోసుకుని తిన
సాగేరు ! మళ్ళీ అంతా తన చుట్టూ చేరుతూ ఉండడంతో ముసలి చెట్టుకి మనసు లోని బెంగ తీరి పోయింది. అదిప్పుడు మళ్ళీ ఎప్పటిలాగే  పచ్చగా కళకళలాడుతోంది. దాని ఫలాలు మునుపటి రోజుల వలె ఎంతో తియ్యగా ఉంటునాయి కూడా ! పక్షులు తిరిగి ఆ చెట్టు మీదకి చేరు కున్నాయి. పాదచారులు అక్కడే సేద తీరుతున్నారు.ముసలి చెట్టులో ఈ మార్పు అందరికీ ఆశ్చర్యం కలిగించింది! అందరితో పాటు యజమాని కూడా ఈ వింతకి చాలా ఆశ్చర్య పోయాడు.
   ఒక రోజు  యజమాని వేకువ సమయంలో ఒంటరిగా వచ్చి, ఇంత లోనే చెట్టు మళ్ళీ పచ్చగా కళకళలాడుతూ ఉండానికి కారణ మేమిటని అడిగాడు.
   దానికి చెట్టు ఇలా జవాబు చెప్పింది : ‘‘ అయ్యా !చెట్లు తమ ఫలాలను తాము తినవు. నదులు తమ జలాలను తాము త్రాగవు. నేల తల్లి తన పంటను తాను తినెయ్యదు. అవన్నీ ఇతరుల కోసమే ! పరోపకారం కోసమే. ఎప్పుడయితే నాపండ్లను జనం తినడం మానీసేరో అప్పటి నుండి నేను మ్రోడు వారి పోవడం మొదలయింది. ఎప్పుడయితే జనం తిరిగి నావద్దకు వస్తూ నా ఫలాలను తినడం తిరిగి మొదలెట్టారో, అప్పటి నుండి నాలో కొత్త జవజీవాలు  కలిగేయి.
 పరోపకారం చెయ్యడంలో ఉండే తియ్య దనమే , నా పండ్లకీ వచ్చింది !’’ అని.
సాధువు దయ వల్ల, ఆ ముసలి చెట్టు మళ్ళీ చాలా ఏళ్ళ పాటుచల్లని నీడనిస్తూ, మధురమైన పండ్లను అందిస్తూవేలాది పక్షులకు ఆలవాలమై అలరింది !

   ఆ ముసలి చెట్టు ఇచ్చే మధుర ఫలాలు అంటే ఇప్పుడు అందరికీ ఎంతఇష్టమో చెప్పలేం ! !

6, అక్టోబర్ 2014, సోమవారం

సాధువు చెప్పిన సలహా !


ఒక ఊళ్ళో గంగులు అనే బలశాలి ఒకడు ఉండే వాడు.వాడికి  కండ బలంతో పాటు, చెప్ప లేనంత అహంకారం కూడా ఉండేది. కన్నూ మిన్నూ కానకుండా పొగరుమోతు తనంతో వ్యవహరిస్తూ ఉండే వాడు. వాడిని చూస్తూనే ఊరి
 ప్రజ లందరూ ప్రక్కలకి తొలగి పోతూ ఉండే వారు. వాడితో ఎవరూ మాట్లాడడానికి సాహసించే వారు కాదు. అది చూసి, వాడు తనంటే అందరికీ చెప్ప లేనంత గౌరవం, భక్తీ ఉన్నాయని అనుకుంటూ ఉండే వాడు. ఆ విషయమే తండ్రికి కూడా తరచుగా చెబుతూ ఉండే వాడు. గంగులు తండ్రిచాలా ఉత్తముడు. తనకి అలాంటి దుర్మార్గుడయన కొడుకు పుట్టి నందుకు ఎప్పుడూ కుమిలి పోతూ ఉండే వాడు. ఎన్ని విధాలుగామంచి బుద్ధులు చెప్పినా , గంగులు వినిపించు కునే వాడు కాదు. అంతే కాక, తండ్రి మీద కూడా విరుచుకు పడుతూ ఉండే వాడు. తండ్రి వాడికి చెప్పి చెప్పి,  విసిగి పోయే వాడు.
    ఇలా ఉండగా ఆఊరికి  ఒక రోజు ఒక సాధుపుంగవుడు వచ్చేడు.అతని రాకతో ఊరి జనం అంతా తీర్ధయాత్ర లాగా బయలు దేరి సాధువును దర్శించు కోవడం మొదలు పెట్టారు.సాధువును చూడాలనే తొందరలో వెళ్తూ దారిలో గంగులు కనిపించినా మునుపటిలా వారు ప్రక్కలకి తొలగి పోవడం  మానేసారు ! దాంతో గంగులుకి విపరీత మయిన ఆగ్రహం వచ్చింది.  వడి వడిగా సాధువు దగ్గరకి వెళ్ళాడు. సాధువును ఏకాంతంగా కలసి ఇలా నిలదీసాడు: ‘‘ మీ రాకతో ఈ ఊరి ప్రజలు నన్ను మునుపటిలా పట్టించు కోవడం మానేసారు. నన్ను చూసి ప్రక్కలకి తొలగి పోవడం లేదు. ఇది వరకటిలా గౌరవ మర్యాదలు చూపించడం లేదు ! నాకు చాలా చిన్న తనంగా ఉంది. వాళ్ళు అలానన్ను ధిక్కరించడానికి కారణం ఏమిటో చెప్పండి’’ అనడిగేడు.
   సాధువు నవ్వి, ‘‘ఊరి ప్రజలు ఇంత వరకూ నిన్ను నిజమైన గౌరవ మర్యాదలతో చూస్తున్నారను కుంటున్నావా ! అది నీ  భ్రమ ! ఊరి వారి నుండి నువ్వు నిజమైన గౌరవ మర్యాదలు పొందాలంటే ,ఒక ఉపాయం చెబుతాను. విను. ఒక వారం, రోజుల పాటు నువ్వు అందరితోనూ స్నేహంగా మెలగు. అందరికీ వీలయినంత సాయం చెయ్యి. అందరితో మంచిగా ఉండు. ఎవరినీ భయ పెట్టేలా ఉండకు. ఇలా  ఓ వారం రోజుల పాటు చేసాక కూడా వారు నన్ను పట్టించు కోవడం లేదని నీకనిపిస్తే , మళ్ళీ నా దగ్గరకి దరా ! ఏం చెయ్యాలో  అప్పుడు చెబుతాను ’’ అని సలహా ఇచ్చేడు.
   సాధువు మాటలతో గంగులు ఆలోచనలో పడ్డాడు. తన తండ్రి తనతో తరచుగా చెప్పేదీ, సాధువు ఇప్పుడు చెబుతున్నదీ ఒకటే ! వారు చెబుతున్నట్టానే ఓ వారం రోజుల పాటు చేసి చూద్దాం ! అనుకున్నాడు. అందరితో సఖ్యంగా ఉంటూ, మంచిగా మర్యాదగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అందరితో కలుపుగోలు తనంతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అందరికీ వీలయినంత సాయం చేసే వాడు.  అప్పుడందరూ అభిమానంతో వాడి చుట్టూ తిరగడం మొదలు పెట్టారు ! ఇంతకు ముందు తనని చూస్తూనే భయంతో ఇళ్ళ లోకి దూరి పోతూ ఉండే పిల్లలు కూడా ఇప్పుడు తన చుట్టూ చేరడం గంగులు గమనించేడు ! వాడికి చాలా సంతోషం కలిగింది .
   వారం తరువాత సలహా కోసం వాడు మరింక సాధువు దగ్గరకి వెళ్ళనక్కర లేక పోయింది !

5, అక్టోబర్ 2014, ఆదివారం

ఏది శాశ్వతం ? !



గోవింద పురాన్ని పాలించిన విక్రమ వర్మ కొలువులో ఇద్దరు మహా కవిపండితులు ఉండే వారు. మార్తాండ వర్మ, అహోబిల శాస్త్రి అనేవి వాళ్ళ పేర్లు. దాయాదులయిన వాళ్ళిద్దరూ పాండిత్యం లోనూ, కవిత్వం చెప్పడంలోనూ దిట్టలు. ఆ రోజులలో వారిని మించిన కవులూ, పండితులూ ఆ రాజ్యం లోనే కాదు, చుట్టు ప్రక్కల ఎక్కడా ఉండే వారు కాదు ! అందు చేత రాజు వారిద్దరికీ మంచి మంచి బిరుదులు ఇవ్వడమే కాక, గొప్ప సత్కారాలు కూడా జరిసిస్తూ ఉండే వాడు.   అయితే, అంతటి రాజాదరణ, ప్రజాదరణా ఉన్నప్పటికీ,  వారి మధ్య కొద్ది కాలంగా మనస్పర్ధలు బయలు దేరాయి. ఇద్దరూ ఒకరి నొకరు దేనికో ఒకదానికి ద్వేషించు కుంటూ ఉండే వారు. దానికి తోడు దాయాదులైన వారి మధ్య ఏవో భూ తగాదాలు కూడా ఉండడంతో  ఆ తగవులు మరింత ఎక్కువయ్యేయి ! ఇద్దరి నడుమ పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే స్థితి వచ్చింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవనే సామెత ఉంది కదా ! విక్రమ వర్మ కొలువు నుండి ఒకరి నొకరు బయటికి గెంటించెయ్యాలని రుట్రలు పన్న సాగేరు ! ఎలాగయినా  రెండో వారికి ప్రభువు చేత దేవిడీమన్నా చెప్పించాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ నోటా , ఈ నోటా వారి మధ్య రగులు కొంటున్న వైరం గురించి రాజుకి కూడా తెలిసింది.  తన రాజ్యానికే గర్వ కారణ మయిన ఆ ఇద్దరు కవులలో ఏ ఒక్కరినీ వదులు కోవడం వికమ వర్మకి సుతరాము ఇష్టం లేదు. బాగా ఆలోచించాడు.
   ఒక రోజు కొలువు తీర్చి,  సభలో అందరి ముందూ ఆ ఇద్దరు కవులతో ఇలా అన్నాడు : ‘‘మీ మధ్య కొద్ది కాలంగా నెకొన్న తగాదాల గురించి మా
 దృష్టికి వచ్చింది. ఇక మీలో ఒకరికే నా కొలువులో స్థానం ఉంటుంది. రెండో కవి రాజ్యం విడిచి వెళ్ళి పోవలసినదే ! అందు చేత మీ ఇద్దరిలో ఎవరిని మా కొలువులో ఉంచాలో నిర్ణయించడానికి మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. మీ ఇద్దరికీ చెరొక తాళ పత్రం  ఇస్తున్నాను. వాటి మీద వ్రాసి ఉన్న పద్యాలను చదివి , గుణ దోషాలను ఎవరయితే చక్కగా విశ్లేషిస్తారో వారే ఇక మీదట మా కొలువులో ఉండానికి అర్హులు .అలా చెప్ప లేని కవికి దేవిడీమన్నా తప్పదు ! ’’ అన్నాడు.. అంటూ ఆ కవులిద్దరికీ వేరు వేరుగా చెరొక తాళపత్ర మూ ఇచ్చాడు.
      ముందుగా మార్తాండ వర్మ న అభిప్రయం ఇలా చెప్పాడు : ‘‘ మహా రాజా ! ఇది చాలా గొప్ప పద్యం ! ఇంత రసవంతమయిన పద్యం నేనింత వరకూ చదవ లేదు ! నేను కూడా ఇంత గొప్ప పద్యం వ్రాయలేననిపిస్తోంది ! కావ్య జగత్తులో ఈ పద్యం శాశ్వతంగా నిలిచి పోతుంది !’’ నఅన్నాడు.
    అతని మాటలు వింటూనే అహోబిల శాస్త్రి ముఖం వెలిగి పోయింది !
 ఆ తర్వాత తన వంతు వచ్చి నప్పుడు అహోడిల శాస్త్రి తనకిచ్చిన పద్యాన్ని నోరారా పొగిడాడు. దాని గొప్పతనాన్ని ఎంతగానో మనసారా కీర్తించాడు.
   అప్పుడు రాజు ఇద్దరు కవులతో ఇలా అన్నాడు : ‘‘ ఈ రెండు పద్యాలూ నిజానికి ఈ మధ్య మీరు వ్రాసిన గ్రంథాల లోనివే ! ఒకరు వ్రాసిన పద్యం ఇంకొకరికిచ్చాను ! మీలో మీకు తగవులు ఉండడం చేత, ఒకరి పద్యాల గురించి వేరొకరికి తెలియదు!
శాశ్వతమయిన కవిత్వం విషయంలో,  తెలియక పోయినా , ఒకరి ఘనతను ఒకరు నిండు మనసుతో శ్లాఘించేరు. అశాశ్వతాలయిన సంపదల గురించి, తక్కిన వాటి గురించి కలహించు కోవడం మీకు తగునా ! ఆలోచించండి !’’ అన్నాడు.
   రాజు మాటలతో కవులిద్దరికీ కను విప్పు కలిగింది.  అప్పటి నుండి వైరం విడిచి,ఎంతో సఖ్యంగా మెలగ సాగేరు.
   అంతే కాదు, అపూర్వమైన కావ్యాలు ఎన్నో వ్రాసి  రాజు మన్ననలు పొందారు !


2, అక్టోబర్ 2014, గురువారం

ఊడల మఱ్ఱి ... బ్రహ్మ రాక్షసి !


ఉజ్జయనికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది. అది కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో ఒక పెద్ద ఊడల మఱ్ఱి ఉండేది.  ఆ అడవి దారంట ప్రక్క ఊళ్ళకి వెళ్ళే బాట సారులు దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. దాని మీద చాలా అల్లరి దెయ్యాలు ఉన్నాయనీ, అవి పాదచారులను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయనీ చెప్పుకునే వారు. అందు చేత, ఎంతో అవసరం పడితే తప్ప, ఆ దారంట చీకటి పడితే ఎవరూ వెళ్ళడానికి సాహసించే వారు కారు ! ఆ అల్లరి దెయ్యాలకు తోడు ఈ మధ్య ఒక బ్రహ్మ రాక్షసి కూడా అక్కడికి వచ్చి చేరిందని , అది అందరినీ పీక్కు తింటోందని  వొక వార్త గుప్పుమంది. బ్రహ్మ రాక్షసి రాకతో అల్లరి  దాదాపు చాలా వరకూ దెయ్యాలన్నీ ఊడల మఱ్ఱి చెట్టు వదలి ఎక్కడికో పారి పోయేయి. వాటి పీడ వదలినా, బ్రహ్మరాక్షసి భయం పట్టుకుంది బాటసారులకు.
    ఇలా ఉండగా, ఒక రోజు నందుడు అనే వాడు జరూరుగా దూర ప్రాంతానికి వెళ్ళ వలసి వచ్చింది. అప్పటికే సాయంత్రమయింది. పొద్దు గూకుతోంది. అన్నం మూట కట్టుకుని, ప్రాణాలు ఉగ్గబట్టుకుని, నందుడు ఆ ఊడల మఱ్ఱి చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చే సరికి, చీకటి చిక్కబడింది. భయంతో నందుడి ఒళ్ళు జలదరించుకు పోతోంది. ఇంతలో ఊడల మఱ్ఱి తొర్ర లోనుండి వొక వికటాట్టహాసం వినిపించింది ! నందుడికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. కొయ్యబారి పోయి నిలబడి పోయేడు.
    వాడు వణికి పోతూ ఉండడం చూసి బ్రహ్మ రాక్షసి గర్వంగా నవ్వుకుంది.  వాడితో లా అంది : ‘‘ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం !  సరే, ఇందాకే రెండు బర్రెలనూ, రెండు ఎనుములనూ తిన్నాను. నాకిప్పుడు అంతగా ఆకలిగా లేదు. అయినా, వాటంగా దొరికిన నర మాంసాన్ని వదులు కోలేను ! నిన్ను తరువాత తింటాను. నేనిక్కడ  కొద్ది కాలంగా ఉంటున్నాను. ఈ ఊడల మఱ్ఱి నన్ను పట్టుకుని వదలడం లేదు. నాకు ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం విసుగ్గా ఉంది !ఎక్కడికియినా కొత్త చోట్లకు వెళ్ళాని ఉంది. కొత్త రుచులను చవి చూడాలని ఉంది. కానీ, ఈ ఊడల మఱ్ఱి నన్ను వదలదే ! తనకి ఎన్ని ఊడలు ఉన్నాయో సరిగ్గా లెక్క కట్టి చెబితేనే నన్ను ఇక్కడ నుండి కదల నిస్తానంటోంది. నాకు ఎన్ని శక్తులు ఉన్నా, దీని ముందు ఎంచేతో పనికి రావడం లేదు. నాకా,  సరిగా లెక్కలు రావు ! దీని ఊడలు లెక్క పెట్టాలని చాలా సార్లు ప్రయత్నించాను, కానీ కుదర లేదు. లెక్క తప్పుతోంది.  అందు చేత , దీనికి ఎన్ని ఊడలు ఉన్నాయో నువ్వు సరిగ్గా లెక్క కట్టి చెబితే నిన్ను వదిలేస్తాను. లేక పోతే తినేస్తాను జాగ్రత్త ! ’’ అంది.
బ్రహ్మరాక్షసి  పీడ వదిలించుకుని ,తప్పించుకునే మార్గం దొరికి నందుకు నందుడు లోలోన సంతోషించేడు.
   వెంటనే బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు : ‘‘దీనికి ఊడలు అసంఖ్యకంగా ఉన్నట్టున్నాయి. అన్నింటినీ లెక్క పెట్టడానికి చాలా సమయం తీసుకునేలా ఉంది.  అదీ కాక, దీని ఊడలు చాలా దూరం వరకూ వ్యాపించి ఉన్నాయి. వాటి మొదళ్ళు వెతుక్కుంటూ కాలి నడకన వెళ్ళాలంటే నా శక్తి చాలదు !  నీరసంతో కుప్పకూలి పోతాను. అదే ఆలోచిస్తున్నాను ... ’’ అన్నాడు.
  ‘‘ అంతే కదా ! ’’ అంటూ బ్రహ్మ రాక్షసి నందుడికి సునాయాసంగా గాలిలో ఎగురుకుంటూ వెళ్ళ గలిగే శక్తిని ఇచ్చే ఒక మంత్ర దండం ఇచ్చింది.
   నందుడు ఆ మంత్ర దండం అందుకుని బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు :
‘‘ ఈ ఊడల మఱ్ఱికి ఎన్ని ఊడలు ఉన్నాయో లెక్క కట్టి పూర్తి చేసుకుని కానీ నీ దగ్గరకి రాను.  నేను తిరిగి వచ్చే వరకూ నువ్వు చాలా నిష్ఠగా ఉడాలి సుమా ! లేక పోతే నా లెక్క తప్పుతుంది.  అంచేత,నువ్వు నేను తిరిగి వచ్చే వరకూ జంతు వథ చేయ కూడదు ! నర మాంసం తిన కూడదు! అంతే కాదు, కేవలం ఆకులూ అలమలూ మాత్రమే తింటూ చాలా నియమంగా ఉండాలి. ఈ నియమాన్ని నువ్వు తప్పేవో, నా లెక్క మళ్ళీ మొదటికే వస్తుంది. జాగ్రత్త ! ’’ అని హెచ్చరించి, బ్రహ్మ రాక్షసి  ఇచ్చిన మంత్ర దండం తల మీద పెట్టు కున్నాడు. దాని మహిమ వల్ల క్షణంలో అక్కడి నుండి మయమై, తను వెళ్ళ వలసిన ఊరికి చేరు కున్నాడు !
ఆ తరువాత మరింక  నందుడు ఆ దారంట రానే లేదు ! తన పని పూర్తయేక, చుట్టు దార్లమ్మట  తన ఊరికి చేరు కున్నాడు.
    బ్రహ్మ రాక్షసి మాత్రం నందుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ , మాంసాహారం మానేసి ఆకులూ అలమలూ తింటూ రోజు రోజుకీ కృశించి పోసాగింది.
     చివరకు అది హారం లేక, చాలా బలహీన పడి పోయింది !
      ఇప్పుడా ఊడల మఱ్ఱి ప్రక్క నుండి వెళ్ళే బాటసారులకి దాని వలన ఏ హానీ లేదు !
        పైగా, వారిలో కొందరు కొంటె కుర్రాళ్ళు ఆట సట్టిస్తూ దానిని అప్పుడప్పుడు ఏడిపిస్తున్నారు కూడా !